ముగ్గురు కుమార్తెలతో చెరువులో దూకిన తల్లి.. ఇద్దరు మృతి
అనుమానం పెనుభూతమైంది. భర్త పెట్టే వేధింపులు భరించలేక భార్య తన ముగ్గురు కుమార్తెలతో కలిసి చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లీ, ఒక కుమార్తె చనిపోగా, మిగిలిన ఇద్దరు చిన్నారులను స్థానికులు రక్షించారు. ఈ సంఘటన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కన్మనూరుకు చెందిన లోకమణి సుజాత (32), నాగరాజు (35) ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరు బతుకు తెరువు కోసం పదేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లి మహాలక్ష్మిపురానికి వచ్చి చెరుకు రసం అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 8, 6, ఒకటో తరగతి చదువుతున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న క్రమంలో భార్యపై భర్తకు అనుమానం, ఆమె జీవితాన్ని నాశనం చేసింది. భార్యపై అనుమానంతో భర్త నాగరాజు తరచూ ఆమెతో గొడవపడుతూనే ఉండేవాడు. బుధవారం ఇరువర్గాల కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. అదే రోజు రాత్రి దంపతుల మధ్య మరోసారి గొడవలు జరిగాయి. గురువారం భర్త పనికి వెళ్లగా, భార్య, ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
మధ్యాహ్నం తల్లీ ముగ్గురు కుమార్తెలను తీసుకొని పెద్దచెరువు వద్దకు వెళ్లింది. ముందుగా బిడ్డలను చెరువులోకి తోసేసి, ఆ తర్వాత తానూ దూకేసింది. అక్కడే చేపలు పడుతున్న వారు వారిని చూసి రక్షించే ప్రయత్నం చేశారు. నలుగురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే సుజాత, చిన్న కుమార్తె మృతి చెందారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు బతికే ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.