తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాల సందర్భంంగా సీఎం కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత తొలిరోజు 5 బిల్లులు, 2 నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం అని పేర్కొన్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ అవతరణ దినోత్సవంగా.. ఒక పర్వదినాన్ని నిర్వహించాలని ప్రకటించారు.
4 కోట్ల బిడ్డల భావోద్వేగం
2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని, ఆ రోజు తెలంగాణ పర్వదినం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు నిత్యసత్యం. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతీ అస్తిత్వమే. అస్తిత్వానికి మూలమైన సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి. తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి అంటే 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ప్రజల మనోఫలకాల్లో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగంణంలో ఆవిష్కరించుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విగ్రహాన్ని రూపకల్పన చేశాం.’ అని తెలిపారు.
మీకు దండం పెట్టి చెప్తున్నా…!
ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారని, తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. అధికారికంగా ఇప్పటివరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదని, ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదపి, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నామన్నారు. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని, తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోబోతున్నామని వెల్లడించారు. 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నామని, దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామని, ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
సభ వాయిదా
అసెంబ్లీలో సీఎం ప్రసంగం తర్వాత సభను వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ శాసనసభ, మండలి ఈ నెల 16 వరకు వాయిదా వేశారు.