- మావోయిస్టులతో కలిసి వందలాది మంది బిజెపి వాళ్లను హతమార్చారు
- ఈటల రాజేందర్ మావోయిస్టు కాదంటూ కితాబు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ ఆయనను అవమానించేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పద్మ’ అవార్డుల కోసం జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని, గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని ఆయన ప్రశ్నించారు.గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను, ఎన్ కౌంటర్లలో పోలీసులను పొట్టన బెట్టుకున్న వ్యక్తి గద్దర్ అని.. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
మావోయిస్టుగా పని చేసి ఎంతో మంది ప్రాణాలు తీసిన వారిలో గద్దర్ ఒకరని.. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని కుండబద్దలు కొట్టారు. సోమవారం కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మావోయిస్టు కాదన్నారు. మావోయిస్టు భావజాలం వేరు.. మావోయిస్టుగా పని చేయడం వేరని పేర్కొన్నారు. మావోయిజంతో ఎంపీ ఈటల రాజేందర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అలాగే.. నంది అవార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలను కుంటున్న గద్దర్ అవార్డులు మా వాళ్లు తీసుకోరని బండి సంజయ్ స్పష్టం చేశారు. గద్దర్ కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలను హతమార్చారని.. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని అన్నారు. గద్దర్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని.. నా దిష్టిబొమ్మ తగలబెడితే నా ఆయుష్షే పెరుగుతుందని సెటైర్ వేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ’గద్దర్ ఎంత మంది బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపించారో తెలియదా..?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
నమ్మిన సిద్దాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను మావోయిస్టులతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందని, తెలంగాణ సెంటిమెంట్‌తో ఎవరు లాభపడ్డారో.. ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సీఎం వ్యాఖ్యలపై తాజాగా బండి సంజయ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. పద్మ అవార్డులు అర్హులకే వొచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుందని, ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరని సంజయ్ అన్నారు. ’గద్దర్‌కి పద్మ అవార్డు ఎలా ఇస్తాం..? ఆయన భావజాలం ఏంటి..? బరాబర్ గద్దర్‌కు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికే ఇస్తాం. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం..? అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.