దమ్ముంటే మూసి పరీవాహక ప్రాంతంలో పర్యటిద్దాం
ఎవరైనా మిమ్మల్ని పొడిగితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..
మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిప్పులు
నీకు దమ్ముంటే .. నేను, మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరీవాహక ప్రాంతంలో కూల్చబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా..? చైతన్యపురి లాంటి కాలనీలకు పోదాం. ఎవరైనా శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తా..అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య మంత్రికి సవాల్ విసిరారు. గురువారం సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలోని గాయత్రి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవు. బై డిఫాల్ట్ సీఎం అయ్యావు. మేము బరిగేసి కొట్లడిన నాడు.. నువ్వు ఆంధ్ర పాలకుల సంకలో ఉన్నావు. నేను మా పార్టీ గానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు. చెరువులు బాగు చేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సకరంగా మాట్లాడుతున్నారు. సిఎంలాగా కాకుండా బ్రోకర్ లా మాట్లాడుతున్నారని ప్రజలే అంటున్నారు. నేను కాదు.కంటోన్మెంట్ లో మీటింగ్ పెట్టీ.. సన్నాసులు, పిచ్చికుక్కలు కరిచిపోతారు అని మాట్లాడుతున్నారు. బతకొచ్చిన వాడు అని మాట్లాడుతున్నారు. చదువుకుంటే సంస్కారం వచ్చేదిజ.. ఇతరులు చెప్పేది వింటే జ్ఞానం వస్తుండే. నేను చదువుకుంది కేశవ్ మెమోరియల్ స్కూల్, నా జూనియర్ కాలేజీ అలియా కాలేజీ, గన్ఫౌండ్రి, డిగ్రీ కాలేజీ సైఫాబాద్ సైన్స్ కాలేజీ, నా బిజినెస్ అంతా ఇక్కడే, నన్ను పట్టుకొని బతుకొచ్చుకొనేవాడు అంటున్నాడు. నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందన్నారు.. నీవు ఎంఎల్‌ఏ గా 5 ఏళ్లు ప్రజల్లో ఉండి సర్వీస్ చేశావా ? మంత్రిగా పనిచేసి ఉంటే సిస్టమ్ తెలిసేది. నీళ్ళమ్మీద దెబ్బలు కొట్టినట్టు పనిచేసావు. రైతుల కోసం వరంగల్లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తో గ్యారెంటీల సభలు పెట్టారు. ఆరు గ్యారెంటీలలో ఒక్క పని కూడా చేయలేదు.
సబర్మతి రీవర్ ఫ్రంట్ కి రూ.1400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రూ2511 కిలోమీటర్లు గంగా ప్రక్షాళన కోసం.. 50 కోట్ల జనాభాను తాకే ప్రాజెక్ట్ గంగానమామి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.మరి మూసీ కోసం నువ్వు పెట్టేది 1.5 లక్షల కోట్లా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. దవాఖానాలలో మూడు నెలలుగా మందులు లేవు. మూడేళ్లుగా గ్రామపంచాయతీలో పనిచేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు రావడం లేదు. ఆర్టీసీ కి ఇచ్చిన 280 కోట్ల చెక్కు బౌన్స్ అయింది. ఈ రాష్ట్రం అప్పుల ఊపులో కూరకు పోయిందని, అసెంబ్లీ వేదికగా చెప్పారు.
ఆర్థిక పరిస్థితి నాశనమైందని ఇవ్వాలనుకున్న కూడా ఇవ్వలేక పోతున్నా అని చెప్తున్న మీరు ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాగలరు అని ఈటల ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష కోట్లు గోదావరి పాలయిందన్నారు. మిషన్ భగీరథ పేరిట నలభై వేల కోట్ల డబ్బులు కేసీఆర్ తిన్నారని చెప్పారు. ఒక రాష్ట్రం అప్పు తేవాలంటే జిఎస్‌డిపి లో 25% కంటే ఎక్కువ దాటకూడదు కానీ ఇప్పటికే దాటింది మళ్లీ కొత్తగా రుణం వచ్చే అవకాశం లేదు. మరి మూసి ప్రక్షాళన కోసం ఎలా తీసుకొస్తారు. నీ రోడ్డు మ్యాప్ ఏంటి ? డిపిఆర్ ఏంటి ? ఎప్పటినుంచి ఎప్పటి వరకు పూర్తి చేస్తావు ?దేనికి ఎంత ఖర్చవుతుంది ? ఎవరు దీనికి కాంట్రాక్టర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నిలదీశారు. కొడంగల్ లో బొందపెడితే ప్రశ్నించే గొంతుని గెలిపించండి అని మల్కాజ్గిరి అడిగితే గెలిపించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టారు. చెరువు బాధితులు ఎక్కువమంది మల్కాజ్గిరిలో ఉన్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శిచారు.