హైడ్రా కూల్చివేతలకు మద్దతు తెలుపుతూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పెద్దలను వదిలి పేదల కట్టడాలను కూలిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రికార్డుల ప్రకారం ఎంతటివారినైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా అడ్డొస్తే వారిపైకి బుల్డోజర్లు ఎక్కించాలని రఘునందన్ అన్నారు.
హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమని, అందువల్లే తాను బీజేపీలో ఉన్నా దానికి మద్దతు ఇస్తున్నానని చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఓ సర్వేలో 78 శాంత మంది సమర్ధిస్తే కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని చెప్పారు.
హైడ్రా కూల్చివేతల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ నే తొలుత కూల్చేవారని చెప్పారు. హైడ్రా పనితీరుకు మద్దతు ఇస్తూనే మూడు లోపాలను, ఒక సవరణను హైడ్రా గుర్తించాలన్నారు. బాధితుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలే ఉన్నందున వారికి పరిష్కార మార్గం హైడ్రానే చూపించాలని అభిప్రాయపడ్డారు