Saturday, October 5, 2024

ఎంపీ వద్దిరాజు విద్యార్థులకు హితవు

విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న అంశంలో,రంగంలో గొప్పగా రాణించేందుకు ప్రణాళికాబద్ధంగా,క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హితవు పలికారు.హైదరాబాద్ దసపల్ల హోటల్ కన్వెన్షన్ హాలులో “రూట్స్ ఇనిస్టిట్యూషన్స్”స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు.తమ పిల్లలు గొప్పగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు గాను తల్లిదండ్రులు తాము పడుతున్న కష్టాన్ని బయటకు కనిపించనివ్వరన్నారు.జీవితంలో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులకు ఎటువంటి కష్టం కలిగించకుండా వారి శేష జీవితం సాఫీగా సాగేలా చూడాలని విద్యార్థులకు ఉద్బోధించారు.

చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని,ఆ రంగంలో కూడా అవకాశాలు మంచి ఉన్నాయంటూ.. సచిన్ టెండూల్కర్, అజహరుద్దీన్, మహ్మద్ సిరాజ్,నిఖత్ జరీన్,సాధుల మేఘన, శ్రీకాంత్ తదితరులను ఎంపీ రవిచంద్ర ఉదహరించారు.అదేవిధంగా రాజకీయాలలో కూడా రాణించవచ్చని,వచ్చే ఎన్నికలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్స్ అమలవుతాయని, అసెంబ్లీ,పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుందని వివరించారు.తాను 30ఏండ్ల కిందట గ్రానైట్ కంపెనీ స్థాపించి కష్టపడి ఈ స్థాయికి ఎదిగానన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో పలువురు ఉన్నతాధికారులు సంప్రదించడంతో ఢిల్లీలోని జాతీయ పోలీస్ అకాడమీకి,ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నాణ్యమైన బ్లాక్ గ్రానైట్స్ ను తమ గాయత్రి కంపెనీ నుంచి అందజేశానని ఎంపీ వద్దిరాజు వివరించారు.సన్నిహితులు పడాల భిక్షపతి 30ఏండ్ల కిందట నెలకొల్పిన ఈ రూట్స్ విద్యా సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించాలని,ఇంకా వేలాదిమందిని ఉన్నత విద్యావంతులుగా, గొప్ప పౌరులను దేశానికి అందించాలని మనసారా కోరుకుంటున్నానంటూ అభినందనలు తెలిపారు.ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో మంచి అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు కష్టించి, ఏకాగ్రత,ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఎంపీ రవిచంద్ర పట్టాలు అందుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు, ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు పలువురు విద్యార్థులకు పట్టాలు, వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు ప్రదానం చేశారు.విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ఆదాయపు పన్ను కమిషనర్ బత్తుల బాలకృష్ణ,బొండాడ ఇంజనీరింగ్ గ్రూప్ ఛైర్మన్ రాఘవేంద్రరావు, రూట్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు పడాల భిక్షపతి తదితర ప్రముఖులు ప్రసంగించారు.కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థినీ విద్యార్థులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికి వేదికపైకి గౌరవంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా “రూట్స్” ఛైర్మన్ పడాల భిక్షపతి ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.విద్యార్థినీ విద్యార్థులు,అధ్యాపకులు, సిబ్బంది అతిథులతో ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమానికి వందలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular