సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మూడు ప్రాణాలను వివాహేతర సంబంధం బలితీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుభాష్ అనే వ్యక్తి భార్య మంజులతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ గొడవలు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. చివరకు భార్య మంజుల పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పిల్లలు ఇద్దరూ సుభాష్ దగ్గరే ఉంటున్నారు. ఈ గొడవలతో మానసికంగా విసిగిపోయిన సుభాష్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుభాష్ నివసిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు అనుమానంతో ఇంటి ఓనర్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్‌ను పగులగొట్టి లోపలికి వెళ్లగా అక్కడ దారుణ దృశ్యం కనిపించింది. మృతదేహాలు తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటం గుర్తించారు.
తండ్రి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటు మంజులకు వివాహేతర సంబంధం ఉండటంతో సుభాష్ మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలు పెద్దగా మారి ఇలా ప్రాణాలు తీసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వివాహేతర సంబంధాలు ఎంత దారుణ పరిస్థితులకు దారి తీస్తాయో ఈ ఘటన చూస్తే అర్థమవుతుందంటున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులు, మంజుల వాంగ్మూలం తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.