- దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహించరాదు
- దరఖాస్తుల పరిష్కారంపై వెంటనే నివేదిక అందచేయాలి
- ప్రతి శనివారం దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహిస్తా
- హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారుల సమీక్షలో
- పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్
టిజి బిపాస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. టిజి బిపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించ డంలో అలసత్వం వహించరాదని, దాన కిషోర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. లే ఔట్, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులో అనుమతులు ఇచ్చే టిజి బిపాస్ దరఖాస్తుల పరిష్కార పురోగతి పై సచివాలయంలో గురువారం ప్లానింగ్ అధికారులతో ముఖ్య కార్యదర్శి దానకిశోర్ సమీక్షించారు.
టిజి బిపాస్ దరఖాస్తుల విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, దరఖాస్తుతో జత చేయాల్సిన ఏవైనా డాక్యుమెంట్‌లు తక్కువగా ఉంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేస్తూ తిరిగి అన్ని డాక్యుమెంట్ లతో దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకూ టిజి బిపాస్ కింద హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసిలకు వచ్చిన దరఖాస్తులు వాటి పరిష్కార ప్రగతిపై తనకు వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఇకనుంచి ప్రతి శనివారం టిజి బిపాస్ దరఖాస్తుల పరిష్కార ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఆయన అధికారులతో పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిటిసిఓ దేవేందర్ రెడ్డి, హెచ్‌ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ లు విద్యాదర్, రాజేంద్ర ప్రసాద్ నాయక్, జిహెచ్‌ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ సిటీ ప్లానర్‌లు పాల్గొన్నారు.