Thursday, November 28, 2024

హైకోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకులు

త్వరలోనే పట్టాలెక్కనున్న మూసీ ప్రాజెక్టు
ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ పరిధిలోని తాత్కాలిక,
శాశ్వత నిర్మాణాల తొలగింపునకు రంగం సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక అయిన మూసీనది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను ప్రభుత్వం తొలగించనుంది. మూసీ పునరుజ్జీవనం విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న చర్యలకు సానుకూలంగా తీర్పును ఇవ్వడంతో ప్రభుత్వం త్వరితగతిన దాని అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఇళ్ల కూల్చివేత, ఆక్రమణల తొలగింపును సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్‌లను సైతం హైకోర్టు విచారించి తుది తీర్పును వెలువరించింది. తన తీర్పులో నగర చరిత్ర, మూసీ వరదలు, నిజాం కాలం నాటి చట్టాలు, తర్వాత కాలంలో చట్టాలను హైకోర్టు ఉదాహరించింది. అందులో ముఖ్యమైనవి కొన్ని….

19 జిల్లాలకు 1317 ఫస్లి యాక్ట్ 8 వర్తింపు
1908లో మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తడంతో నాటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భవిష్యత్‌లో మూసీ సమీపంలోని వారికి రక్షణ కల్పించేందుకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణాలు చేపట్టడంతో రక్షణ గోడలు కట్టించారు. మూసీ ఎగువ భాగంలోని వరదను అడ్డుకునేందుకు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు ఇప్పుడు నగరానికి మంచి నీటిని అందిస్తున్నాయి. అన్ని ప్రజా రహదారులు, వంతెనలు, మురుగు నీటి కాలువలు, నదులు, కొండ జాలు ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, చెరువులు, కుంటలు, కాలు వలు, అన్ని రకాల నీటి ప్రవాహాలు ప్రభుత్వానికి సంబంధించినవంటూ నిజాం ప్రభుత్వం (1317 ఫస్లి యాక్ట్ 8) చట్టం చేసింది.

ఆ చట్టం నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు, కన్నడ, మరాఠా ప్రాంతాల్లోని 19 జిల్లాలకు వర్తించేసింది. 1317 ఫస్లి యాక్ట్ 8 ప్రకారం నాటి ప్రభుత్వం సర్వే చేసి అన్ని గ్రామాల్లోని ఎడ్లబండ్ల దారులు, కాలిబాటలు, చెట్లు, బావులు, నదులు, ఇళ్లు, చెరువులు, ఇతర వివరాలతో నక్షాలను రూపొందించింది. 1317 ఫస్లి యాక్ట్ 8 ఉన్నప్పటికీ కొందరు చెరువులు, సరస్సులు, నదీ గర్భాలు (రివర్ బెడ్), ఇతర జలవనరులను ప్లాట్లుగా మార్చివేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. నది మధ్య భాగాల్లో వివిధ మత సంబంధ కట్టడాలను నిర్మించారు. ఈ నేపథ్యంలో 1317 ఫస్లి యాక్ట్‌ను మరింత బలోపేతం చేసి జల వనరులను ఆక్రమణల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ ఇరిగేషన్ యాక్ట్ 1357 ఫస్లిని తీసుకొచ్చింది.

జలాశయాలు, కుంటలు, చెరువులు, ఆనకట్టలు, కాలువల నియంత్రణ, నిర్వహణ ప్రభుత్వం….
ఈ యాక్ట్ 1948, అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం అన్ని జలాశయాలు, కుంటలు, చెరువులు, ఆనకట్టలు, కాలువలు, వాటి డిస్ట్రిబ్యూటరీలు, స్లూయిస్‌ల నిర్మాణం, నిర్వహణ, నియంత్రణ అంతా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటుంది. పైన పేర్కొన్న వాటి పరిధిలో ఏ నిర్మాణం, పని చేపట్టాలన్నా ప్రభుత్వం నియమించిన ఇరిగేషన్ అధికారి (ప్రభుత్వం ప్రజా పనుల విభాగం లేదా రెవెన్యూ లేదా మరేదైనా విభాగం నుంచి నియమించిన వారి నుంచి) అనుమతి తీసుకోవాలని సూచించింది. చెరువులు, కుంటలు, ఇతర జల వనరులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని ఇరిగేషన్ అధికారికి ప్రభుత్వం దాఖలు పరిచింది.

హైకోర్టు తీర్పు ప్రకారం సర్వేలను అడ్డుకోవద్దు….
హైకోర్టు తీర్పు ప్రకారం మూసీనది బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), నదీ గర్భం (రివర్ బెడ్ జోన్)లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత వాటిని తొలగించాలి. మూసీ పునరుజ్జీవనంతో ప్రభావితమయ్యే వారిపై ప్రభుత్వం సర్వే చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి తగిన ప్రదేశాల్లో ఆవాసం కల్పించాలి. ఒకవేళ పట్టా, శిఖం పట్టాలు ఉంటే వారికి అధికారులు నోటీసులు ఇచ్చి ఆ భూమిని సేకరించి చట్ట ప్రకారం వారికి పరిహారం చెల్లించాలి.

రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. నిర్ణీత కాలపరిమితిలో ఈ ఆక్రమణలు తొలగించాలి. మూసీ నది పరిధిలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ట్రయల్ కోర్టులు స్టేలు, ఇజంక్షన్ ఆర్డర్లు ఇచ్చే ముందు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలొమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. పిటీషనర్లు, ఆక్రమణదారులు మూసీ రివర్ బెడ్, ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలో చేపట్టే సర్వేలను అడ్డుకోవద్దని హైకోర్టు సూచించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular