- హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
- ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్:సీఎం రేవంత్ రెడ్డి
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.1.50 లక్షల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామన్నారు. ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని సీఎం చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్
ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఎంతోమందిని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కమ్మవర్గం సహకారం అందించాలని సీఎం కోరారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తుందన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తమకు నచ్చని విషయాలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. దాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు తెలియజేశాయన్నారు. తెలుగువారైన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని అంతా ఆశించామని, కానీ కాకపోవడం నిరాశ కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఢిల్లీలోనూ తెలుగువారి నాయకత్వం ఉండేదని.. ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
మళ్లీ ఆ అలాంటి నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. కమ్మసంఘం కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో లిటిగేషన్లు పెట్టిందని సీఎం రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణానికి కూడా సహకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ లైబ్రరీలో తాము చదువుకున్న చదువు ఇవాళ ఉన్నత స్థానాలకు రావటానికి ఉపయోగ పడిందని.. దీనిని గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏ మాత్రం భయపడనంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్జీ రంగా.. వెంకయ్య నాయుడు.. లాంటి నేతల పేర్లను చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటూ వివరించారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని.. కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తామంటూ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని.. అది తమ ప్రభుత్వ విధానం కాదంటూ స్పష్టంచేశారు.