Thursday, November 28, 2024

నదీ పునర్జీవనం కోసమే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు

  • ఈ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టడం లేదు
  • అవసరం మేరకు మాత్రమే తొలగింపులు, తరలింపు చేస్తున్నాం
  • బాధిత కుటుంబాలకు తగిన విధంగా సహాయ, పునరావాస చర్యలు చేపడుతాం
  • కేంద్రానికి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

నదీ పునర్జీవనం కోసమే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చింది. పెద్దఎత్తున ప్రజలను నిరశ్రాయులను చేయమని, అవసరం మేరకు మాత్రమే తొలగింపులు, తరలింపు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో తెలిపింది. తొలగింపులు, తరలింపులు చెస్తే బాధిత కుటుంబాలకు తగిన విధంగా సహాయ, పునరావాస చర్యలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ నిచ్చిందన్న విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు వెల్లడించారు. మూసీపై బిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి కెఆర్ సురేష్ రెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనెత్తగా పార్లమెంట్‌లో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సంబంధించిన విషయాలను తెలంగాణ ప్రభుత్వం సమాచారాన్ని రాతపూర్వక సమాధానంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు బిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి సురేష్‌రెడ్డికి అందచేశారు.

మూసీ ప్రాజెక్టుపై అధికార యంత్రాంగం సన్నాహాలు ఇలా…
నదీ పునర్జీవనం కోసం భూసేకరణకు, భూములు కోల్పోయే బాధిత కుటుంబాలకు విషయంలో సంబంధిత చట్టాల ప్రకారం ముందుకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. మూసీ నదీ గర్భం నుంచి, బఫర్‌జోన్ నుంచి తరలించే వారి కోసం మానవతా దృక్పథంతో 15 వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. నదీ పునర్జీవం, కాలుష్య నివారణ , వరదల బారి నుంచి కాపాడేందుకే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. బాధిత కుటుంబాల కోసం వారి జీవన ప్రమాణాలకు మద్దతు కోసం ఒక కమిటీని కూడా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ యంత్రాంగం పలు సన్నాహాలు చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు
ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించడంతో పాటు దీనికి సంబంధించిన చర్యలపై Musi Riverfront Development Corporation Limited (MRFDCL) మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌ఎఫ్‌డిసిఎల్) సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత కుటుంబాల జాబితాను కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది.

మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నదీగర్భం మూసీకి అటూ ఇటూ ఉన్న ప్రాంతం (కట్టలు) మాత్రమే వస్తాయి. రెండో దశలో మూసీ నదికి అటూ ఇటూ 50 మీటర్ల పరిధిలోని బఫర్‌జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డిపిఆర్‌ను మాత్రం ఒకే ప్రాజెక్టు కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగేందుకే ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందునా మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండోదశకు అవసరమైన కార్యాచరణ మొదలు పెట్టే అవకాశం ఉందని కేంద్రమంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన జవాబులో తెలిపారు.

మూసీనది గర్భంలో 1,600 ఇళ్లు
మూసీనది గర్భంలో ప్రభుత్వం గుర్తించిన దాని ప్రకారం 1,600 ఇళ్లు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామందిని ఇప్పటికే ఖాళీ చేయించి అక్కడి నుంచి తరలించారు. ఫలితంగా ప్రాజెక్టు తొలి దశను త్వరితగతిన ప్రారంభించుకునేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బఫర్‌జోన్‌ను కలుపుకొంటే సుమారు 13వేల మంది వరకు ఇళ్లను కోల్పోతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, ఈ ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి ఏడాదిన్నర సమయం పడుతుందని, ఈ మొత్తం ప్రాజెక్టును ఆరేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కేంద్రమంత్రి తెలిపారు.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం మూసీకి అటు ఇటు రిటెయినింగ్ వాల్ నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి అటు ఇటు కట్టలను సుందరీకరణ చేయాలని భావిస్తున్నారన్నారు. ఇక బఫర్‌జోన్‌లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేర రెండు వైపులా విశాలమైన రహదారిని నిర్మిస్తుండగా అటు ఇటు రహదారుల ప్రక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular