Friday, November 8, 2024

Musi Riverfront Project గాంధీ సరోవర్‌గా బాపూఘాట్….?

బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ, గాంధీ ఐడియాలజీ సెంటర్‌ల ఏర్పాటు
వీటి నిర్మాణాల నమూనాలు, డిజైన్‌లపై
ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు, చర్చలు
సిఎం ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా అధికారుల ప్రణాళికలు

గాంధీ సరోవర్‌గా బాపూఘాట్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మూసీతీరంలోని బాపూఘాట్ ను అద్భుతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నమూనాలు, డిజైన్‌లపై చర్చలు, విస్తృత సంప్రదింపులను ప్రభుత్వం చేపడుతోంది. బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ ఎత్తైన గాంధీ విగ్రహంతో పాటు అక్కడ ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం, దానికి సంబంధించిన నమూనాలు, డిజైన్‌లపై విస్తృతంగా మేధావులతో సంప్రదింపులు చేస్తోంది.

సోదర, సౌభ్రాతృత్వానికి సంకేతంగా, ప్రపంచశాంతికి చిహ్నంగా….
ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్ గా అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బాపూఘాట్ ను సోదర, సౌభ్రాతృత్వానికి సంకేతంగా, ప్రపంచశాంతికి చిహ్నంగా అటు అధ్యాత్మికంగా, ఇటు విద్యాబోధన కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా ఈ బాపూఘాట్‌ను అధునాతనంగా అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సిఎం రేవంత్ అధికారులకు సూచించారు. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలు ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్ గా గాంధీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ యోచిస్తున్నారు. ఆ దిశగా సిఎం రేవంత్ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదీ తీరం సుందరమైన విశాల ప్రాంతం కావటంతో బాపూఘాట్‌లో ఎలాంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, దీనిని ఏ ఆకృతిలో తయారు చేయాలి, ఎంత ఎత్తుతో తయారు చేయించాలి, డిజైన్లు ఎలా ఉండాలన్నది ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తోంది.

దేశ, విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి..?
దేశ, విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి. ఎక్కడెక్కడ గాంధీ ఆశ్రమాలున్నాయి. ఏయే నమూనాలో అవి ఉన్నాయి. వెంటనే వాటి గురించి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్‌లో ఎలాంటి విగ్రహం పెట్టాలి, మూసీనదీ తీరంలో ఎంత ఎత్తున ఆ విగ్రహాన్ని నిర్మించే అవకాశముందన్న సాధ్యాసాధ్యాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

పాట్నాలోని గాంధీ మైదాన్‌లో 72 అడుగుల…
ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాల్లో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న గాంధీ విగ్రహం అత్యంత ఎత్తయ్యింది. దీని ఎత్తు 72 అడుగులు కాగా, 2013 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. దీనిని కాంస్యంతో తయారు చేశారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ అప్యాయంగా ఉన్నట్లుగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రపంచంలో వివిధ దేశాల్లోనూ గాంధీ విగ్రహాలున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహముంది. ఇప్పటివరకు భారత దేశం బయట ఉన్న అతి పెద్ద విగ్రహం ఇదే. గాంధీ దండి మార్చ్‌కు నడుస్తున్న భంగిమలో ఈ విగ్రహముంటుంది. శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఇది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

ఏ నమూనాలో ఉంటే బాగుంటుందన్న దానిపై విస్తృతంగా చర్చలు….
2018లో గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఐక్యతా చిహ్నంగా సర్దార్ వల్లభబాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా దీనిని నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే ఎత్తున గాంధీ విగ్రహం నిర్మించాలా..? పాట్నాలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి మించిన ఎత్తులో దీనిని నిర్మించాలా…? కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న భంగిమలో గాంధీ విగ్రహాన్ని తయారు చేయించాలా, లేదా దండి మార్చ్‌కు కదులుతున్నట్లుగా నిలబడి ఉండాలా, మరేదైనా నమూనా ఎంచుకోవాలా అన్న విషయంలో విస్తృతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలని, అవసరమైతే అన్ని వర్గాల మేధావులు, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను స్వీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

అసెంబ్లీ ఎదుట ‘మైలైఫ్ ఈజ్ మై మెసేజ్’ అనే సందేశంతో…
ప్రపంచంలో అందరి మదిలో నిలిచేలా బాపూఘాట్‌లో మహాత్ముడి విగ్రహాం ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎదుట ఉన్న మహాత్మగాంధీ విగ్రహమే ఇప్పటివరకు తెలంగాణలో పెద్దది. ధ్యాన ముద్రలో ఉన్న ఈ గాంధీ విగ్రహం ఎత్తు 22 అడుగులు. ‘మైలైఫ్ ఈజ్ మై మెసేజ్’ అనే సందేశంతో కాంస్యంతో దీనిని తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్నిఆవిష్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బాపూఘాట్ లో ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను సైతం అధికారులు వేగవంతం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular