వరుస భూకంపాలతో విలవిల
థాయిలాండ్, చైనాలోనూ ప్రకంపనలు
తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టం
మయన్మార్‌ను వరుస భూకంపాలు వొణికించాయి. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. పలుచోట్లు- ఎత్తయిన అంతస్తులు నేలకూలినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్‌లోని మండలేలో గల ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది.ఇరావడీ నదిలోకి వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో కూడా భూమి కంపించింది.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అంతేకాకుండా చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టరు స్కేలుపై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. అయితే, అందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. మయన్మార్‌లో 12 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భారీ భూంకంపాలు సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది.
థాయ్ లాండ్ లో పలు భవనాలు ధ్వంసం
భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు- యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. పలు భవనాల్లో అలారమ్ మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. అనేక భవంతులు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు బయటికొచ్చాయి. ప్రమాదం సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా? శిథిలాల కింద చిక్కుకుపోయారా? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు, మయన్మార్‌లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు- తెలిసింది. పలు రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. అయితే.. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైనా కన్పించింది. భారత్‌లోని కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు-చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది.