ఫార్ములా-ఈ కార్ రేసు కేసు విచారణలో వేగం పెంచారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.గురువారం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోఆయన న్యాయస్థాన్ని ఆశ్రయించారు. ఈ నెల 6న కేటీఆర్‌ను ఏసీబీ విచారణ చేయాల్సింది.కానీ తన న్యాయవాదిని అనుమతించనందున హాజరుకాలేనంటూ ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చి మరీ తిరిగి వెళ్లడంతో విచారణ జరగలేదు. దాంతో ఏసీబీ అధికారులు అదే రోజు కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఏసీబీ విచారణకు అరవింద్‌కుమార్ హాజరు : ఈ కేసులో ఏ2గా ఉన్న అరవింద్‌కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి ద్వారా అరవింద్ కుమార్ నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఇదే కేసులో బీఎల్‌ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. 45కోట్ల 71 లక్షలు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది.