రంగుల ప్రపంచంలో ఎగుడు దిగుడు ప్రయాణం ప్రతి ఆర్టిస్టుకు అనుభవమే. అలాంటి పాఠాలెన్నో నేర్చుకుంది పూజా హెగ్డే. మొదటి సినిమాలో నటించాక దశాబ్ధం పాటు మంచి అవకాశం కోసం వేచి చూసింది. తమిళంలో జీవా సరసన నటించన ఈ బ్యూటీకి మళ్లీ సౌత్ లో పెద్ద అవకాశం రావడానికి పదేళ్లు పట్టింది. అయితే వరుణ్ తేజ్ ముకుంద, నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాల్లో ఒకేసారి అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత కథంతా తెలిసిందే. పూజా హెగ్డే టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. కొన్నేళ్ల పాటు కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఉన్నట్టుండి ఆ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. వరుసగా పెద్ద హీరోలతో ఫ్లాపులు రావడం ఈ అమ్మడిని చికాకు పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోను పరిమిత ఆఫర్లే ఉన్నాయి.
మరోవైపు సౌత్ లోకి నెమ్మదిగా కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తోంది. ఇంతలోనే పూజా హెగ్డే అక్కినేని హీరో నాగచైతన్య సరసన అవకాశం అందుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చై ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి విరూపాక్ష దర్శకుడితో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా పూజాకు ఆఫర్ దక్కడం యాధృచ్ఛికం. చాలా కాలంగా టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న పూజాకు ఇది సదవకాశం. నాగ చైతన్య – పూజా హెగ్డే ఒక లైలా కోసం (2014) లో ప్రేమికులుగా నటించారు. ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రశంసలను అందుకుంది. కొంత గ్యాప్ తర్వాత తిరిగి ఈ జోడీని తెరపై చూసే అవకాశం లభించనుంది.