మాదాపూర్‌లోని N-కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడంతో హీరో నాగార్జున భారీగానే నష్టపోయారనే చర్చ నడుస్తోంది. మొత్తం కన్వెన్షన్ విలువ రూ. 500 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులోని నాలుగు హాళ్ల ద్వారా ఫంక్షన్ జరిగిన రోజు రూ. 50 లక్షల నుంచి కోటి వరకూ, ఏటా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందట. హైడ్రా కూల్చేసిన హాళ్లతో పాటు ఈ సీజన్లో వాటిల్లో జరగాల్సిన కార్యక్రమాలు జరగకపోవడంతో ఈ ఆదాయమంతా ఆయన కోల్పోయినట్లే అవుతుంది.
నల్లా ప్రీతంరెడ్డితో కలిసి నాగార్జున.. ఈ ఎన్-కన్వెన్షన్ ను మొత్తం 10 ఎకరాల్లో నిర్మించారు. అందులో మూడున్నర ఎకరాల తుమ్మిడి చెరువును కబ్జా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో.. 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉందని తేల్చారు. దీంతో గత శనివారం ఉదయం ఆరు భారీ యంత్రాలతో కన్వెన్షన్ కూల్చివేశారు. ఎన్-కన్వెన్షన్‌కు వెళ్లే దారులంటినీ మూసివేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు దాన్ని నేలమట్టం చేశారు.
అయితే ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా ఆధికారులు కూల్చివేయడంపై హీరో నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కూల్చివేతలు ఆపాలంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పు వచ్చే లోపే హైడ్రా ఆధికారులు ఎన్ కన్వెన్షన్‌ను నెలమట్టం చేశారు.