పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ఫొటోను బహూకరించారు. ఆ చిత్రం ఇటీవల భారతదేశంపై పాకిస్థాన్ జరిపిన దాడికి సంబంధించినదని పేర్కొన్నారు. కానీ ఆ ఫోటో 2019 కి సంబంధించినది. దీంతో దాయాది దేశానికి అసదుద్దీన్ ఓవైసీ తనదైన స్టైల్లో మరోమారు చురకలంటించారు. ఈ నకిలీ ఫొటోపై ఎంపీ అసదుద్దీన్ ‘నకల్ కర్నే కే లియే అకల్ చాహియే'(కాపీ కొట్టడానికైనా తెలివితేటలు అవసరం) అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందం కూర్చుంది పొరుగు దేశం పాక్. పోరాడే సత్తా లేక తోక ముడిచినా సీజ్ ఫైర్ తర్వాత మేకపోతు గాంభీర్యాలు పోతూనే ఉంది. మోసపూరిత ప్రకటనలతో అంతర్జాతీయంగా నవ్వులపాలవుతున్నా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్‌కు ఓ చిత్రాన్ని బహూకరించారు. ‘ఆపరేషన్ బున్యాన్’ సమయంలో ఇండియాపై దాడికి సంబంధించిన చిత్రమని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారతదేశం సైనిక చర్య చేపట్టగా.. దాయాది దేశం కూడా ‘ఆపరేషన్ ‘బున్యన్ అల్–మర్సుస్’ అంటూ తమ సైనిక చర్యకు పేరుపెట్టింది. ఈ నకిలీ ఫొటోపై ఒవైసీ ‘నకల్ కర్నే కే లియే అకల్ చాహియే'(కాపీ కొట్టడానికైనా తెలివితేటలు అవసరం) అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
వాళ్ళు జోకర్లు.. ఒవైసీ హాట్ కామెంట్స్..
పాకిస్థాన్ కుటిల నీతిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత ఎంపీ ప్రతినిధి బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం కువైట్‌లో పర్యటిస్తున్న బృందంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఫేక్ మెమెంటో అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశంతో పోటీ పడేందుకు పాకిస్థాన్ హాస్యాస్పదమైన పనులు చేస్తోందని ఎగతాళి చేశారు. ‘నిన్న పాకిస్థాన్ ప్రధాని ఆర్మీ చీఫ్‌కు ఒక ఫోటోను బహుమతిగా ఇచ్చారు. ఈ మూర్ఖులు భారతదేశంతో పోటీ పడాలని కలలు కంటున్నారు. 2019లో చైనా ఆర్మీ డ్రిల్ చిత్రాన్ని షేర్ చేసి అది భారతదేశంపై విజయం అని ప్రచారం చేసుకుంటున్నారు. పాక్ చెప్పేవనీ అబద్ధాలే.. వాళ్ళ ఆలోచన చూడండి ఎలా ఉందో.. కాపీ కొట్టడానికి కూడా అర్హత లేని స్టుపిడ్ జోకర్స్.. ‘నకల్ కర్నే కే లియే అకల్ చాహియే'(కాపీ కొట్టడానికైనా తెలివితేటలు అవసరం) కదా అంటూ సెటైర్లు వేశారు. పాక్ ఏం చెప్పినా నమ్మెద్దు’ అని అన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్ భారతదేశంపై వందల కొద్దీ డ్రోన్లు, మిస్సైల్స్ తో ప్రయోగించినా.. మన సైన్యం అన్నింటినీ విజయవంతంగా తిప్పికొట్టింది. పాక్ జరిపిన దాడుల వల్ల ఇండియాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయినప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్ పై మేం విజయం సాధించామని సంబరాలు చేసుకుంటోంది. తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఆర్మీ మునీర్‌కు ప్రధాని షహబాజ్ షరీఫ్ ‘ఆపరేషన్ బున్యాన్’కు సంబంధించిన చిత్రం అంటూ ఒక ఫొటోను ప్రెజెంట్ చేశారు. కానీ, ఆ ఫొటో 2019 చైనా రాకెట్ ఆర్టిలరీ డ్రిల్ కు సంబంధించినది.