ఆఫ్రికాలోని నమీబియా చాలా రోజులుగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలలుగా దేశంలో తీవ్ర కరువు, ఆహార కొరత ఏర్పడింది. దేశ జనాభాలో సగం మంది ఉన్న సుమారు 1.4 మిలియన్ల మంది ప్రస్తుతం ఆహారం లేక అల్లాడుతున్నారు. దారుణమైన కరువు నేపధ్యంలో పంటల ఉత్పత్తి, పశుపోషణ ప్రతికూలంగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నమీబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నమీబియాలో మొత్తం 700 జంతువులను చంపాలని నిర్ణయించారు పాలకులు. ఏనుగులు, హిప్పోలు, జీబ్రాలతో సహా 700 కంటే ఎక్కువ అడవి జంతువులను చంపడానికి ప్రణాళికలు సిద్దం చేసింది ప్రభుత్వం.
ఇందులో 83 ఏనుగులు, 30 హిప్పోలు, 60 గేదెలు, 50 ఇంపాలా, 100 బ్లూ వైల్డ్‌బీస్ట్, 300 జీబ్రాలను చంపనున్నట్లు నమీబియా పర్యావరణ, అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరువుతో బాధపడుతున్న పౌరులకు ఆహారంగా జంతువుల మాంసం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు సుమారు 150 జంతువులను చంపడం ద్వారా 1,25,000 పౌండ్ల మాంసాన్ని ప్రజలకు అందించింది నమీబియా సర్కార్. ఈ మాంసం ద్వార ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే కాకుండా.. పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.