సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ, బెయిల్ పూచీకత్తుకు సంబంధించిన పత్రాలను అందించారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు నిన్న అల్లు అర్జున్‌కు కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని అల్లు అర్జున్‌కు సూచించింది.