దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని, సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న సుహాసిని, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
2018 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని మహాకూటమిలో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనూహ్యంగా ఆమె పార్లమెంట్ ఎన్నికల వేళ సిఎంతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. సుహాసిని సినీహీరో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ల సోదరి. ప్రస్తుతం తెలంగాణ టిడిపి పార్టీ ఉపాధ్యక్షురాలిగా సుహాసిని ఉన్నారు.