మీడియాకు నా క్షమాపణలు = మంచు మనోజ్
” మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని.. ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు” అని నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులుపై దాడి చేసిన నటుడు మోహన్ బాబు, అన్న మంచు విష్ణు తరపున మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. ఆయన మీడియాపై చేసిన దాడిని మనోజ్ ఖండించారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. జర్నలిస్టులకు తానేప్పుడు తోడుంటానన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తన కోసం వచ్చిన మీడియాకు ఇలా జరగడం చాలా బాధకరం అన్నారు. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. నాన్న అంటే తనకు చాలా ఇష్టమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
బుధవారం జల్పల్లి నివాసం నుంచి రాచకొండ సీపీ కార్యాలయానికి బయలుదేరుతూ మనోజ్ మీడియాతో మాట్లాడారు. “నేను ఇంటి వాళ్ల మీద ఆదాయం మీద ఆధారపడలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తుల కోసం మా నాన్నతో గొడవపడుతున్నాననేది వాస్తవం కాదు. పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరా దృశ్యాలు చూపించండి. నా వ్యక్తిగత జీవితం బయటపెట్టి నన్ను బాధపెడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పా?. ఒంటరి అయిన నా భార్యకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.” అని మంచు మనోజ్ ప్రశ్నించారు.
విచారణ తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తా
ఏమీ ఆశించకుండా తన కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డానని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. వేరొకరి కడుపుకొట్టి తన కడుపు నింపుకునే రకం కాదని అన్నారు. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. మంగళవారం తన తండ్రి చేసిన దాడిలో గాయపడిన జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మంగళవారం రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారన, అందుకే తాను వెళ్తున్నానని మనోజ్ చెప్పారు.
మా నాన్న అంటే నాకు ప్రాణం
‘మా నాన్న అంటే నాకు ప్రాణం మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణును వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. అమ్మను ఆస్పత్రిలో చేర్పించి తర్వాత నాపై దాడులు మొదలుపెట్టారు.’ అని మంచు మనోజ్ అన్నారు.