భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించాయి. ఎడతెలరపిలేని వానల కారణంగా రాష్ట్రంలో జనజీవనం స్థంబించిపోయింది. ప్రధానంగా విజయవాడ సిటీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే బెజవాడలో పరిస్థితి మామూలుస్థిలోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితుల్ని చూసిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తమ వంతు చేయూతలో భాగంగా కొందరు విరాళాలు ప్రకటిస్తుంటే, మరికొందరు వరద బాదితులకు ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ. సినీ, వ్యాపార రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రెండు కోట్ల విరాళం ప్రకటించారు నారా భువనేశ్వరి. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయని, సహాయచర్యలు, వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని నారా భువనేశ్వరి తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవడాన్ని బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.