తెలుగు నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది. ఎన్‌డిపిఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 27(బి) కింద శిక్షార్హమైన నేరాల కోసం పిటిషనర్‌పై ఛార్జిషీట్ చేయబడిందని, సహ నిందితుడి ఒప్పుకోలు స్టేట్‌మెంట్‌పై మాత్రమే సమర్పించబడిందని, తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ (ఐఎ) ను అనుమతిస్తూ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే ఇచ్చింది.
హేమ.. కృష్ణవేణిగా మారి
కాగా బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్నారు. అబ్బే.. తాను రేవ్ పార్టీలోకి పోలేదని హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లోని ఓ వీడియో.. ఆ మరుసటి రోజు పచ్చడి చేస్తున్నట్లు మరో వీడియోను హేమ రిలీజ్ చేసింది. ఆమె ఫొటోను బెంగళూరు పోలీసులు విడుదల చేయడంతో సీన్ మొత్తం రివర్సయ్యింది. కృష్ణవేణి పేరుతో నటి హేమ పార్టీకి హాజరైంది. పోలీసు రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం జరిగింది. అయితే.. హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షలు చేయగా.. 86 మందికి రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో ఉన్న 30 మందిలో 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడం గమనార్హం. డ్రగ్స్ తీసుకున్న వారందరికీ సీసీబీ పోలీసులు నోటీసులు పంపారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ విడతల వారీగా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాగా రేవ్ పార్టీ కేసులో నటి హేమ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. హేమ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.