కులగణన సర్వేలో బీసీ జనాభా లెక్కల విషయంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) చేస్తున్న ప్రకటనలపైన టీపీసీసీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా మల్లన్నకు బుధవారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నుంచి షోకాజ్ నోటీసు జారీ చేసింది. కుల గణన పత్రాలను బహిరంగంగా కాల్చివేయడాన్ని తప్పు పట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. వాస్తవానికి కాంగ్రెస్ టికెట్‌పైన ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న.. కొద్దినెలలుగా వివిధ అంశాలపైన పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఆయన విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకు వ్యతిరేకంగానూ తీన్మార్ మల్లన్న మాట్లాడటం పట్ల సీరియస్ అయ్యారు.
తిరుగుబాటు తరహా..!
ఇటీవల బీసీలకు సంబంధించిన ఓ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న.. ఓ అగ్ర కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కులగణన సర్వే నివేదికను తప్పుపడుతూ నిరసనగా ప్రతిని కాల్చివేశారు. తీన్మార్ మల్లన్న తీరుపైన పార్టీ నేతల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు నాయకులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులూ చేశారు. తీన్మార్ మల్లన్న ప్రకటనల పట్ల ఆగ్రహంగా ఉన్న టీపీసీసీ.. ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. మల్లన్న మీద వచ్చిన ఫిర్యాదులపైన ఒకటి రెండు రోజుల్లో క్రమశిక్షణ చర్యల కమిటీ భేటీ అయి.. విచారణకు పిలువనున్నది. దీనిలో భాగంగానే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మరోవైపు.. తీన్మార్ మల్లన్న తనను తిడితే స్వాగతిస్తానని, కానీ.. ఓ కులాన్ని తిట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తాజాగా ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా క్రమశిక్షణకు లోబడే ఉండాలన్నారు. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటదని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.