నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు
భారత్ లో నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పుడీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ముందు బిహార్‌లో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రచారం జరగ్గా.. కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చడంతో పాటు లైట్ గా తీసుకుంది. తాజాగా బిహార్ క్రైం బ్లాంచ్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నీట్ పరీక్షకు సంబందించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పేపర్ లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు ఏకంగా 30 లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్లు విచారణలో తేలింది.
NEET UG Entrance Test 2024 Scam
15 రోజుల క్రితం నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి సిట్.. ఇప్పటివరకు మొత్తం 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో బిహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజినీర్ కూడా ఉండటం గమనార్హం. నీటి పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడిన గ్యాంగ్ తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆ జూనియర్ ఇంజినీర్ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ కోసం కొంత మంది అభ్యర్థుల నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక నీట్ ప్రశ్నా పత్రం లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.