వైద్య విద్య ప్రవేశాలకోసం నిర్వహించే నీట్ పరీక్ష మే 4న జరగనుంది. తెలంగాణలో 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
ఆ పెన్నులతోనే ఎగ్జామ్..
ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గం.లకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారు. విద్యార్థి బయోమెట్రిక్ తప్పనిసరి. ఎగ్జామ్ హాల్ లో ఇచ్చే పెన్నులతోనే పరీక్ష రాయాలి.
ఇక, విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు గుర్తింపు కార్డును తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లు, పర్సులు, కలర్‌ఫుల్ దుస్తులు, బంగారు అభరణాలు అనుమతించరు. విద్యార్థులకోసం ఎగ్జామ్ సెంటర్ లో తాగునీటితోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్‌లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సందేహాలకోసం టోల్ ప్రీ నంబర్ 1800 425 1442లో సంప్రదించాలని సూచించారు.