కాళేశ్వరం కమిషన్ నోటీసులపై రాజకీయ పక్షాలు స్పందిస్తున్నాయి. తాజాగా పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై ఈటల రాజేందర్ మాట్లాడారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని, అలాంటి నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారంటూ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలకు పీసీ ఘోష్ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అ నోటీసులపై బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. తమకు ఎలాంటి భయం లేదని కేటీఆర్ అంటే.. అవే వ్యాఖ్యలు ఈటల రాజేందర్ కూడా చేశారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది లేదన్నారు. పీసీ కమిషన్ ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తనతో మంత్రులుగా పనిచేసిన వాళ్లంతా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా అని ఈటల ప్రశ్నించారు. కాగా జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ 6 హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్‌ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పషం చేసింది.
వాస్తవానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సమర్పించాల్సి ఉంది. అయితే కేసీఆర్, హరీష్, ఈటల స్టేట్మెంట్లు లేకుండా రిపోర్ట్ ఇస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో.. వారిని కూడా విచారించాకే రిపోర్టు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటిదాకా 109 మంది అధికారులు, ప్రైవేట్వ్యక్తులను కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారించింది.