బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన తాజా చిత్రం బ్రహ్మా ఆనందం. బ్రహ్మానందం తాతగా, రాజా గౌతమ్ ఆయన మనవడిగా నటించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులను వివరించారు.
“ఇక నేను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను. నా ఆశలు, ఆశయాలు నెరవేర్చడానికి, ప్రజాసేవ చేయడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు… ఇక నేను పూర్తిగా సినిమా రంగానికే అంకింత అవుతాను. ఇటీవల నేను పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండడంతో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు… రాజకీయంగా నేను ఎలాంటి ముందడుగు వేయడంలేదు. చిత్ర పరిశ్రమలోనే ఉంటాను.
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎంతో ఒత్తిడి అనుభవించాను. నన్ను మాటలు అన్నవాడ్ని, ఏమీ అనని వాడ్ని కూడా తిట్టాల్సి వచ్చేది. ఏం తిట్టాలో కూర్చుని మరీ రాసుకోవాల్సి వచ్చేది.
నేను గంభీరంగా మారిపోవడం చూసి ఓ రోజు సురేఖ అడగనే అడిగింది… ఏంటండీ మీరు అసలు నవ్వడమే మానేశారు అంది. నాకే అనిపించింది… నాలోని హాస్య గ్రంథులు దొబ్బేశాయా అనుకున్నాను. కానీ రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక నాలోని వినోదం మళ్లీ వచ్చింది” అని చిరంజీవి వివరించారు. దీంతో ఈ వేదికగా ఆయన ఇక రాజకీయాలకు దూరంగ ఉంటానని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు.