ములుగు జిల్లాలోని మేడారంలో నేటి నుంచి సమ్మక్క, సారలమ్మ మినీ జాతర ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహా జాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభం కానున్న జాతర 15వ తేదీ వరకు కొనసాగుతుంది.
నేడు మండమెలిగె పండుగతో జాతర ప్రారంభిస్తారు. రేపు మండమెలిగె పూజలు, ఎల్లుండి (శుక్రవారం) భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్న జాతర నిర్వహిస్తారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం 5.3 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జాతర నేపథ్యంలో వనదేవతల దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీగా తరలివస్తున్నారు.