Sunday, September 29, 2024

నాలుగైదు నెలల్లో కొత్త ఆబ్కారీ పోలీస్‌స్టేషన్లు అందుబాటులోకి…!

  • త్వరితగతిన చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశం
  • గ్రేటర్ పరిధిలో పోస్టింగ్‌ల కోసం ఎక్సైజ్‌లో ఒత్తిడి
  • పని ఒత్తిడిలో ఎక్సైజ్ సిబ్బంది, ఉద్యోగులు

ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొస్తున్న ఆబ్కారీ శాఖలో సరికొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎక్సైజ్ స్టేషన్‌లు నాలుగైదు నెలల్లో ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త స్టేషన్‌లు ప్రారంభం అయితే అధికారులు, సిబ్బందికి పనిని విభజన చేసి తర్వాత వారిని ఆయా స్టేషన్‌లకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 కొత్త స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసి పరిధిలో 12 కొత్త స్టేషన్‌లతో పాటు మరో 2 (సికింద్రాబాద్, ముషీరాబాద్) ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లను విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొత్త వాటి సంఖ్య 16కు చేరుకుంటుంది. సంవత్సరం కాలంగా ఈ స్టేషన్‌ల ఏర్పాటు ముందుకుపడకపోవడంతో మిగతా స్టేషన్‌లలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బంది, అధికారులపై కేసుల ఒత్తిడి అధికంగా అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు డ్రగ్స్, గుడుంబా, గాంజా, అక్రమమద్యం సరఫరాపై ఎక్సైజ్ సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నట్టుగా ఉన్నతాధికారులు సైతం గుర్తించారు.

ప్రభుత్వం దృష్టికి సమస్య…
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లలోనూ పోస్టింగ్‌ల కోసం ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, సిఎంపై కొందరు ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు సంబంధించి విషయాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెడ్డి సైతం వీటి ఏర్పాటుపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది.

ముఖ్యంగా గుడుంబా, గాంజా, డ్రగ్స్ లాంటి మత్తు నిషేధిత పదార్థాలను గ్రేటర్ పరిధిలో ఎక్కువగా విక్రయిస్తుండడం వాటికి చెక్ పెట్టాలంటే కొత్త పోలీస్‌స్టేషన్‌లను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు, సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు వల్ల జిల్లాలో పనిచేస్తున్న మరింత మంది సమర్ధవంతమైన అధికారులు, సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేసి అక్రమ మద్యం, గుడుంబా, డ్రగ్స్‌లను అరికట్టవచ్చని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమలుతో ఆలస్యం
ఆబ్కారీ శాఖ నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా రూ.35 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో పాటు 139 ఆబ్కారీ పోలీస్‌స్టేషన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొత్త స్టేషన్‌లు ఏర్పాటయితే అక్రమ మద్యం, గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే పోలీస్‌స్టేషన్‌లలో శంషాబాద్, సరూర్‌నగర్, హయాత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్, మల్కాజిగిరి, అమీర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట, కుత్బుల్లాపూర్, లింగపల్లి స్టేషన్లు ఉన్నాయి.

దీంతోపాటు పఠాన్‌చెరు స్థానంలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లను విభజించనున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లా హన్మకొండలో మరో స్టేషన్ కొత్తగా రానుంది. అయితే వీటిని ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యం అయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular