- సమర్ధులైన సీనియర్ ఐఏఎస్‌లకు అవకాశం
- ప్రభుత్వ పరిశీలనలో పలువురి పేర్లు
హెచ్‌ఎండిఏ కమిషనర్, జాయింట్ కమిషనర్‌ల స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే కొందరి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. హెచ్‌ఎండిఏ కమిషనర్, ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిశోర్‌కు వేరే శాఖ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంఏయూడితో పాటు హెచ్‌ఎండిఏలకు సమర్ధులైన అధికారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. ఇక హెచ్‌ఎండిఏ జాయింట్ కమిషనర్‌తో పాటు హెచ్‌జిసిఎల్ ఎండిగా ఉన్న ఆమ్రపాలి త్వరలోనే ఎపికి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆమె జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిహెచ్‌ఎంసికి సీనియర్ ఐఏఎస్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆమ్రపాలి కాట, (ఐఏఎస్, 2010) బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ కాగా, ఆమె ఎపి కేడర్ చెందినవారు. ప్రస్తుతం ఈమెతో పాటు వాకాటి కరుణ, (ఐఏఎస్, బ్యాచ్ 2004), రోనాల్ రాస్, (ఐఏఎస్, 2006), వాణీ ప్రసాద్, ప్రశాంతి, (ఐఏఎస్ 2009), ఐపిఎస్ కేడర్‌కు చెందిన మాజీ డిజిపి అంజన్ కుమార్, (ఐపిఎస్, 1990), అభిలాష బిస్త్, [ఐపిఎస్, 1994], అభిషేక్ మహంతి, (ఐపిఎస్, 2011)లు తెలంగాణలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పనిచేస్తున్న ఎపి కేడర్ ఐఏఎస్‌లను తమకు పంపాలని- డిఓపిటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతోపాటు ఎపిలో పని చేస్తోన్న తెలంగాణకు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎపి ప్రభుత్వం డిఓపిటికి రాసిన లేఖలో పేర్కొంది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఎపి కేడర్ అధికారులను అక్కడికి పంపాలని డిఓపిటి వారం రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలిసింది.
ఐఏఎస్, ఐపిఎస్‌లు తెలంగాణ, ఎపిలకు వెళ్లాల్సి రావడంతో….
ఈనెల 25వ తేదీన ఈలోపు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఈనెల 25 వ తేదీన ఢిల్లీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) అధికారులతో సమావేశమై, క్యాడర్ వివాదంలో డిఓపిటికి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపిఎస్‌లు ఎపిలో పనిచేస్తుండగా వారు తెలంగాణ రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఎపి నుంచి చెరువు హరిచరణ్, (ఐఏఎస్), శ్రీజన గుమ్మళ్ల, (ఐఏఎస్), శివశంకర్, (ఐఏఎస్)లు తెలంగాణకు వెనక్కి రావాల్సి ఉంటుంది.
మరోవైపు 1988 బ్యాచ్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మొదలు తెలంగాణకు కేటాయించబడిన తరువాత ఎపికి ఆప్షన్ పెట్టుకొని వెళ్లిపోయింది. ఆమె ప్రస్తుతం అక్కడ అబ్జార్బ్ అయింది. మరో అధికారి ఎస్‌ఎస్ రావత్ ముందుగా ఎపికి అలాట్ అయినా, న్యాయస్థానం తెలంగాణకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన తెలంగాణకు తిరిగి రావాల్సి ఉంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్‌లు తెలంగాణ, ఎపిలకు వెళ్లాల్సి రావడంతో త్వరలోనే హెచ్‌ఎండిఏ, ఎంఏయూడిలకు కొత్త బాస్‌లు వస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం.