Wednesday, May 14, 2025

బెంగళూరులో లక్ష పైచిలుకు కొత్త ఆటోలకు అనుమతి

  • తెలంగాణలోని గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోల కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వాలి: ఆటో సంఘాల నాయకుల డిమాండ్
  • తుక్కుపేరుతో దోపిడీ చేస్తున్న రవాణాశాఖ అధికారులు, ఫైనాన్షియర్‌లు
  • పాత ఆటో స్క్రాప్ చేసి ప్రోసీడింగ్ తీసుకున్నా షోరూంల్లో లక్షల్లో చెల్లింపు
  • డీలర్‌లు, రవాణా శాఖ అధికారుల దందా

ఆటోల స్క్రాప్ (తుక్కు) అధికారులకు కనకవర్షం కురిపిస్తోంది. కొందరు రవాణాశాఖ అధికారులు ఫైనాన్షియర్‌లు, దళారులతో కలిపి ఈ స్క్రాప్ దందాలో పాలుపంచుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. అయితే తుక్కుదందాకు సంబంధించి కేంద్రం నిబంధలను తొక్కడంతో పాటు టెండర్ లేని వాళ్లు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తుండడం విశేషం. గ్రేటర్‌లో వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి రవాణాశాఖ అధికారులు ప్రోసీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రోసీడింగ్‌ను డీలర్‌కు చూపిస్తే వారు కొత్త ఆటోలను ఇస్తారు. అయితే ఈ ప్రోసీడింగ్ ఇచ్చే విషయంలో రవాణా శాఖ అధికారులు డీలర్‌లతో పాటు దళారులతో కుమ్మక్కై ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తుండడం విశేషం.

1,50,000ల సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ఆటోలు
ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో గతంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పరిధిలో ఆటోల కొనుగోళ్లను బంద్ చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 1,50,000ల సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోళ్లకు (గత నెలలోనే) అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే బెంగళూరులో లక్ష పైచిలుకు ఆటోలు ఉండగా ప్రస్తుతం అనుమతిచ్చిన వాటితో కలిపి సుమారు 2,50,000ల ఆటోలు రోడ్లపై తిరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని గ్రేటర్ పరిధిలో కూడా కొత్త ఆటోల కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని ఆటో సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆటో సంఘాల నాయకులు గతంలో సమావేశం అయినప్పుడు గ్రేటర్ పరిధిలో ఆటోల కొనుగోళ నిషేధం గురించి, ఆటోల స్క్రాప్ దందా గురించి ఆయనకు ఫిర్యాదు చేశారు. కొత్త ఆటోలకు సంబంధించి అనుమతుల విషయంలో మంత్రి కూడా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆటోల సంఘాల నాయకులకు హామీనిచ్చారు. స్కాప్ దందా పారదర్శకంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరలోనే ఆటోల స్క్రాప్ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు కొత్త ఆటోల కొనుగోళ్లకు సంబంధించి అనుమతులను సైతం జారీ చేస్తామని ఆటో సంఘాల నాయకులకు మంత్రి హామినిచ్చినట్టుగా తెలిసింది. అయినా కొందరు రవాణా శాఖ అధికారులు పాత ఆటోల తుక్కుదందాను యథేచ్ఛగా కొనసాగిస్తుండడం విశేషం.

వీడియో, ఫొటోలు తీయకుండా ప్రోసీడింగ్
కొందరు రవాణా శాఖ అధికారులు ఈ తుక్కుదందాకు సంబంధించి నిబంధనలను తుంగలో తొక్కడంతో పాటు యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దందాతో సంబంధం ఉన్న కొందరు రవాణా శాఖ అధికారులను బదిలీ చేసినా వారు మళ్లీ చక్రం తిప్పుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. పాత ఆటోను స్క్రాప్‌కు తీసుకొచ్చినప్పుడు యంత్రంతో ఆ ఆటోను నాలుగు ముక్కలుగా చేయాలి. అనంతరం ఆటో చేస్ నెంబర్ ఆధారంగా ఆ ఆటోను స్క్రాప్ కింద మార్చినట్టు రవాణా శాఖ అధికారులు ప్రోసీడింగ్ ఇవ్వాలి. ఈ సమయంలో రవాణా శాఖ అధికారులు ఈ తతంగాన్ని వీడియో, ఫొటోలు తీయకుండా, ఆటోను స్క్రాప్ చేయకుండానే చేసినట్టుగా ఆ యజమానికి ప్రోసీడింగ్ ఇచ్చి వారి నుంచి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ స్క్రాప్ చేయని ఆటోను ఆ వాహనాల యజమానులు వేరే జిల్లాలో రూ.30 నుంచి రూ.50 వేలకు అమ్ముకుంటున్నారని ఆటో యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు.

కొత్త వాటి కోసం లక్షల ముడుపులు
అయితే ఇదే అదునుగా రవాణాశాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు తీసుకొని అనుమతులిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆటోకు రూ.3 నుంచి -రూ.4లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు రవాణాశాఖ కార్యాయాల్లో ఈ అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుందని ఆటో యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఆటో ధర రూ. 5 లక్షల 50 వేలు
సాధారణంగా వాహనాల ధరలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఒకే ధర ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కొనుగోలు ఆటోల ధరల విషయంలో లక్షల్లో తేడా ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆటోల కొనుగోళ్లపై నిషేధం ఉండడంతో రవాణా శాఖ అధికారులతో పాటు డీలర్లు, ఫైనాన్షియర్‌లకు ఇది ఒక వరంగా మారింది. వేరే జిల్లాలో కొత్త ఆటో ఖరీదు సుమారు రూ. 2.50 లక్షలు ఉండగా అదే ఆటోను హైదరాబాద్ పరిధిలో కోనుగోలు చేయాలంటే రూ. 5 లక్షల 60 వేలను ఖర్చుచేయాల్సి వస్తోంది. ఆటోలను బ్లాక్ మార్కెట్లో కోనుగోలు చేయాల్సి రావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆటోయూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్మిట్ కోసం పెద్ద మొత్తంలో
2002లో కేంద్ర ప్రభుత్వ నియమించిన బూరేలాల్ కమిటీ ఈ ఆటోల నిషేధించడంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొత్త ఆటోల కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లేక పోవడంతో ఆటోలను కొనుగోలు చేయాలనుకునే వారి పర్మిట్ పేరుతో రూ. 2.50 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆటోడ్రైవర్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆటో పర్మిట్ ఉంటే కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఆటో స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా స్క్రాప్ చేసిన ఆటోలకు సంబంధించిన వివరాలతో కొత్త ఆటోలకు అనుమతి (పర్మిట్ ) పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా పర్మిట్ కోసమే పెద్ద మొత్తంలో సమర్పించాల్సి వస్తోందని ఆటోడ్రైవర్ యూనియన్ నాయకులు వాపోతున్నారు. ఇక షోరూంల్లో ఆటో రిక్షా ధర రూ.2 లక్షల 50 వేలు ఉంటే ఎవరైనా కొత్తగా ఆటో రిక్షా కొనుగోలు కోసం వెళితే పర్మిట్‌తో కలిపి ఒక్క ఆటోకు రూ.5 లక్షలకు పైగానే చెల్లించాల్సి వస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com