Friday, May 23, 2025

మూడు కాదు.. నాలుగు స్తంభాలాట కారు పార్టీలో కొత్త కథ

పదేండ్లు ఏకఛత్రాధిపత్యం.. చుట్టూ విపక్షం అనేదే లేని పాలన.. చివరకు అసెంబ్లీలో కూడా ప్రశ్నలు వేసేది అధికారపక్షమే.. సమాధానం చెప్పేది కూడా అధికార పార్టే. అందులో వేళ్ల మీద లెక్కపెట్టేంతగా మూల స్తంభాలు. ఒకటి కేసీఆర్‌.. రెండు కేటీఆర్‌.. మూడు కవిత.. నాలుగు హరీశ్‌రావు. నడిపించారు.. అంతా సాగించారు. కానీ, విధి బెడిసికొట్టింది. బీఆర్ఎస్ పార్టీకి గ్రహాలు తిరగబడ్డాయి. పదేండ్ల ఏకపక్ష అధికారం ఆ పార్టీ నేతలను నేల విడిచి సాము చేసేలా మార్చింది. ఫలితంగా ఓటమిపాలైంది. విపక్షంలో తొలి ఏడాది అష్టకష్టంగానే గడిచింది. కానీ, సెకండ్ ఇయర్ లోనే కష్టాలు రెట్టింపు అయ్యాయి. పార్టీలో.. కాదు.. కాదు.. కుటుంబ రాజకీయాలు నడిరోడ్డుకెక్కాయి. పార్టీ పగ్గాలు ఎవరీకి అప్పగించకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ కు ఒక్కసారిగా కుటుంబంలో రాజకీయ కలహాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్లుగానే కారు పర్మినెంట్‌గా షెడ్‌కు పరిమితమవుతుందా? ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ కీలక నేతలు సైలెంట్ వెనుక ఏం జరుగుతోంది? ఇది కంటిన్యూ అయితే నేతలు చెదిరిపోవడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

లేఖ చెప్పిన రహస్యం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూతురు కవిత ఓపెన్‌గా లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ లేఖ ద్వారా చాలా విషయాలను ఆమె తెరపైకి తెచ్చారు. డాడీ అని కవిత ప్రస్తావిస్తూ చెప్పాల్సిన నాలుగు మాటలు సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశారు. కవిత లేఖతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య అంతర్గత బంధాన్ని బయటపెట్టారు. ఈ విషయంపై నోరు విప్పలేక అసలు పాయింట్‌ను డైవర్ట్ చేసే పనిలో పడ్డారు కొందరు నేతలు. ఈ విషయాలపై అధినేత కేసీఆర్ నోరు విప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడితే మరింత రచ్చ అవుతుందని భావించి సైలెంట్‌గా ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేటీఆర్‌పై ఫార్ములా కేసు విషయంలో పెద్దాయన మౌనాన్ని ప్రదర్శించారు. ఎన్నో పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు పార్టీలో జరుగుతున్న పరిణామాలు అన్నీ తెలుసని అంటున్నారు.
తాజాగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో నాలుగు స్థంబాలాట జరుగుతుందని ఎప్పుడో చెప్పానన్నారు. కవిత లేఖ బయటకు వస్తుందని 10 రోజుల ముందు తాను చెప్పాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా అవినీతి సొమ్ము పంపకాల విషయంలో జరిగిన పంచాయితీ. పదవులు, ఆస్తులు అన్నకి ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారట కవిత. ఆమెని పార్టీ నుంచి బయటకు పంపేందుకు రంగం సిద్ధమైందని వ్యాఖ్యానించారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో మరిన్ని ప్రకంపనలు ఖాయమన్నారు. త్వరలో జరగనున్న స్థానిక పంచాయితీ ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నం కవిత చేస్తోందని చెప్పకనే చెప్పారు.
కవిత లేఖపై స్పందించారు బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం కవితకు ఎందుకొచ్చింది? తండ్రిని కలుసుకోలేనంత పరిస్థితుల్లో కవిత ఉందా? అన్నాచెల్లెళ్ల మధ్య ఎందుకు చెడింది? కుటుంబ కలహాన్ని బీజేపీపై రుద్దడం ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నారా? కవిత లేఖపై ఇప్పటివరకు కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ఉనికి కోల్పోతున్న పరిస్థితులు ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, మిగతా పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు. కవితను బీజేపీ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, ఆమెను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు. లిక్కర్ స్కామ్‌ విచారణను మా పార్టీకి ఎలా అంటగడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎత్తుగడలో భాగమే కవిత లేఖ వ్యాఖ్యానించారు. మొత్తానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com