Thursday, April 10, 2025

‘ఈ లోకంలో ఉండాలని లేదు’..

పెళ్లైన 17 రోజులకే తనువు చాలించిన నవ వధువు

పెళ్లి జరిగి కేవలం 17 రోజులు మాత్రమే అయ్యింది. భర్తతో హైదరాబాద్‌లో కాపురం కూడా పెట్టింది. ఇక తన కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించారు తల్లిదండ్రులు. అయితే అంతలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుందా నవ వధువు. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కోసం వేసుకున్న కాళ్ల పారాణి కూడా ఆరకముందే కాటికి చేరిన కూతురును చూసి తల్లడిల్లారా పేరెంట్స్‌. ఈ హృదయవిదారక సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక భాగ్యలక్ష్మి (24)ని మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో పెద్దలు పెళ్లి చేశారు. ఆగస్టు 18వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ఉదయ్‌కిరణ్‌ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో పెళ్లి అయిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా శనివారం భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే ఒక రోజు ఉండి సోమవారం కూతురును తీసుకొని స్వగ్రామం తక్కళ్లపల్లికి వచ్చారు.

కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన భాగ్యలక్ష్మి ఏమైందో ఏమో కానీ బుధవారం ఒంటిగంట సమయంలో బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చేతిపై.. ‘నేను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు.. నన్ను ఎవరూ ఏమనలేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నా’ అని రాసి ఉంది. పెళ్లై సంతోషంగా ఉంటుందని అనుకున్న పేరెంట్స్‌ ఈ సంఘటనతో గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com