హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చడం కాక రేపుతోంది. నాగార్జున అక్రమట్టడం కూల్చుడు తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఏ హీరో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమకట్టడాలు ఉన్నాయని ఇప్పటికే ఫిర్యాదులున్నాయి. అవన్నీ ఆయా చెరువుల పరిధిలోనే ఉన్నాయనే చర్చ కూడా ఉంది. అయితే, నాగార్జున తర్వాత ఇప్పుడు ఎవరి అక్రమ నిర్మాణంపై దృష్టి పెట్టారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరోగా భావించే వ్యక్తి ఫాంహౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అనుమానాలున్నాయి.
హైడ్రా.. ఈ పేరు వింటే భూకబ్జాదారులు వణికిపోతున్నారు.. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది హైడ్రా. సినీ సెలబ్రెటీలను సైతం వదలకుండా కూల్చుడే పనిగా చెలరేగిపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేశారు అధికారులు. హైదరాబాద్ మాదాపూర్‌లో N కన్వెన్షన్ సెంటర్ కూల్చుడు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక నాగార్జున తర్వాత ఏ హీరో అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చబోతున్నారు? అసలు ఏంటీ హైడ్రా?
హైడ్రా అంటే..?
అక్రమ నిర్మాణాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నిత్యం అక్కడ ఈ దందాలపై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఈ దందాల వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీలు.. రాజకీయ నేతలు ఉంటారనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తాయి. అందుకే ఇలాంటి దందాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం హైడ్రా వ్యవస్థను పటిష్టం చేసింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనికి సారధిగా ఐజీ రంగనాథ్ వ్యవహారిస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
హైడ్రాపైనే ఫుల్ ఫోకస్
గత నెలలో హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్. మొత్తం 259మంది ఆఫీసర్లు.. సిబ్బందిని కేటాయించారు. ఒక ఐపీఎస్, ముగ్గురు గ్రూప్1 స్థాయి ఎస్పీయేలు, ఐదుగురు డిప్యూటీ సూపరింటెండెంట్స్, 21మంది ఇన్స్పెక్టర్స్, 33 మంది ఎస్సైలు, 12 మంది రిజర్వ్ ఎస్సైలు, 101 మంది కానిస్టేబుల్స్, 72 మంది హోమ్ గార్డ్స్, అనలిటిక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను హైడ్రాకు ఇచ్చారు.
రంగనాథ్ దెబ్బకు వణికిపోతున్న అక్రమార్కులు
అనుమతి లేనివి.. కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. దీంతో ఇప్పుడు ఆక్రమణల దందాలో పాతుకపోయినవారు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అటు హైడ్రా చీఫ్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌కు పవర్ ఫుల్ ఐపీఎస్‌గా పేరుంది. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్‌ను అణిచివేయడంలో కర్కశంగా వ్యవహరించారు రంగనాథ్. ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. అదే సమయంలో రంగనాథ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.
నెక్ట్స్ ఎవరు?
మరోవైపు నాగార్జున అక్రమట్టడం కూల్చుడు తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఏ హీరో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా మంది సినీ హీరోలకు అక్రమకట్టడాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. స్టార్ స్టెటస్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం అక్రమకట్టడాలన్ని కూల్చుతుండడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. సినీ హీరో అయినా.. పలుకుబడి ఉన్న రాజకీయ నాయుకుడైనా ఇలానే వ్యవహరించాలని కోరుకుంటున్నారు. అయితే, ఇప్పుడు నాగార్జున తర్వాత ఎవరి కట్టడాలపై హైడ్రా పడుతుందనే భయం నెలకొన్నది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ కూడా అంతో, ఇంతో కోపంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో సినీ తారల ఆక్రమణలపై హైడ్రా తీసుకునే చర్యలకు సీఎం సపోర్ట్ చాలా ఉంటుంది.