నిజామాబాద్ జిల్లాలో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. స్థానికంగా ఏర్పాటు చేసిన రైతు మహోత్సవ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అయితే.. హెలీప్యాడ్ బదులు మరో చోట హెలీకాప్టర్ ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ బదులుగా రైతు మహోత్సవ ప్రాంగణంలో ల్యాండింగ్ అయ్యింది. హెలీకాప్టర్ ల్యాండింగ్‌తో ఒక్కసారిగా భారీగా గాలులు వీచాయి. రైతు మహోత్సవ వేదిక కుప్ప కూలింది. దీంతో పలువురు పోలీసులు, అధికారులకు గాయాలయ్యాయి. భయంతో సభకు వచ్చిన ప్రజలు పరుగులు తీశారు. ఈ సభలో పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు దాదాపు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ ఘటనతో అవన్నీ చిందరవందరగా పడిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు సభను తిరిగి ప్రారంభించేందుకు హుటాహుటిన ఏర్పాట్లు చేశారు. దీంతో కొద్దిగా ఆలస్యంతో మీటింగ్ ప్రారంభమైంది. అయితే.. పైలెట్ హెలీప్యాడ్ లో కాకుండా సభా ప్రాంగణంలో హెలీకాప్టర్ ఎందుకు ల్యాండింగ్ చేశాడనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.