Wednesday, December 4, 2024

నివేదిక సిద్ధం

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లు

ఈ నెలలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు నివేదిక సిద్ధమైంది. మహిళా విశ్వవిద్యాలయమని చెప్పి ఇప్పుడు ఓయూ పేరిట సర్టిఫికెట్లు ఇస్తున్నారని, యూజీసీ గుర్తింపు పొందిన మహిళా వర్సిటీ పేరుపైనే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇటీవలే విద్యార్థినులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి సైతం వర్సిటీపై నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపించారు.
మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మారుస్తున్నామని 2021లోనే నిర్ణయించిన కేసీఆర్‌ ప్రభుత్వం, 2022 ఏప్రిల్‌ 22న జీవో 12ను జారీ చేసింది. ఆ వెంటనే ఇన్‌ఛార్జి వీసీని నియమించింది. అయితే వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో బిల్లును మాత్రం ప్రవేశపెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేసేందుకు సన్నద్ధమైనా, చివరి నిమిషంలో దాన్ని పక్కన పెట్టింది. మహిళా యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరంలో పలు పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థినులు కోర్సును గత ఆగస్టులో పూర్తి చేశారు.

యూజీసీ ఆమోదిస్తేనే వర్సిటీ పేరిట పట్టాలు
ఇప్పుడు వారికి పట్టాలు ఇవ్వాల్సి ఉండటంతో వివాదం తెరపైకి వచ్చింది. మహిళా వర్సిటీ పేరిట పట్టాలు ఇవ్వాలంటే తొలుత వర్సిటీకి చట్టం రావాలి. అది కావాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. బిల్లు చట్టం రూపం దాల్చిన తర్వాత దాన్ని యూజీసీకి పంపించాలి. ఆ చట్టాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆమోదిస్తేనే మహిళా వర్సిటీ పేరిట పట్టాలు ఇవ్వడానికి ఉంటుంది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసి.. సీఎం ఆమోదం కోసం పంపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular