Saturday, April 5, 2025

మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

  • 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్‌లు నిల్వలు ఉన్నాయి
  • ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రభుత్వాన్ని, తనను
  • అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉంది…
  • తప్పుడు వార్త రాసిన ఆ పేపర్‌పై
  • 100 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తా
  • ప్రభుత్వ పాలసీలు ఏమైనా ఉంటే అవన్నీ కేబినెట్‌లో నిర్ణయం జరుగుతాయి
  • ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోమవారం ఒక దినపత్రికలో వచ్చిన కథనం ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా బిఆర్‌ఎస్ అనుకూల పత్రికలో ఈ కథనం రాయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు జర్నలిస్టులు కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలసీలు ఏమైనా ఉంటే అవన్నీ కేబినెట్‌లో నిర్ణయం జరుగుతాయన్నారు. 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్‌లు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించలేదని, తాము ఒక్కోక్కటిగా బకాయిల చెల్లింపులు చేస్తున్నామన్నారు.

మద్యం అమ్మకాలు తగ్గితే వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలి
మద్యం అమ్మకాలు తగ్గితే వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని, మద్యం అమ్మకాలు తగ్గడం వలన ప్రజలకు ఏమైనా నష్టం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తాగుడు పెంచాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, మద్యం అమ్మకాల విక్రయాలు తగ్గితే బిఆర్‌ఎస్ పార్టీకి ఏమైనా నష్టం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో అబ్కారీ శాఖలో పైరవీలు చేస్తేనే బదిలీలు, ప్రమోషన్‌లు ఉండేవని, కానీ, తమ ప్రభుత్వంలో పైరవీలకు స్థానం ఉండదని ఆయన తెలిపారు. జూపల్లి మంత్రిగా ఉన్న శాఖలో అవకతవకలు, అవినీతి అనేది ఉండదని ఆయన పేర్కొన్నారు.

కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ మనుగడ కష్టంగా ఉందని, అందుకే తమ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత బకాయిలు పెండింగ్‌లో ఉన్నందునే బీర్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రోహిబిషన్, ఆబ్కారీ శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారిని స్థాన చలనం చేస్తామన్నారు. అబ్కారీ ,ప్రోహిబిషన్ శాఖపై తప్పుడు వార్త రాసిన ఆ పేపర్‌పై 100 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com