Tuesday, March 11, 2025

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు
  • కాంగ్రెస్‌ ‌నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌
  • సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం
  • బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజు శ్రవణ్‌

ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, ‌శంకర్‌ ‌నాయక్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా నామినేషన్ల కార్యక్రమం సాగింది. వీరికి సిఎం సహా మంత్రులు సంతకాలు చేశారు.  మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్‌కు 4, బిఆర్‌ఎస్‌ ‌కు ఒకటి దక్కనున్నాయి. తమకు వొచ్చే నాలుగులో ఒక సీటును పొత్తు ధర్మం ప్రకారం సీపీఐకి కాంగ్రెస్పార్టీ కేటాయించింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐతో కాంగ్రెస్‌ ‌పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు రెండు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది.

కానీ కొత్తగూడెం ఒకటే ఇచ్చి భవిష్యత్‌ ‌లో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్‌ ‌సీపీఐకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది. ఇకపోతే బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజ్‌ ‌శ్రవణ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఆయన వెంట కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌తదితరులు వొచ్చారు. మాజీ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. దాసోజు గతంలో గవర్నర్‌ ‌కోటాలో నియిమితులయినా గవర్నర్‌ ఆలస్యంతో ఆగిపోయింది. ఐదు సీట్లకు ఐదుగురే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవం కానున్నాయి. ఎన్నికలు నిర్వహించే అవకాశం రాకపోవచ్చు. ఇదిలావుంటే అసెంబ్లీలో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలం ప్రకారం కాంగ్రెస్‌ ‌పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. అయితే పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించింది.

ఒక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల వోట్లు అవసరం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ టికెట్‌ ‌మాజీ ఎంపీ విజయశాంతికి దక్కడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి ఎమ్మెల్సీ రేసులో రాములమ్మ  పేరు లేదు.  చివర్లో అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వొచ్చింది. విజయశాంతి నేరుగా దిల్లీలోనే పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ టికెట్‌ ‌సాధించుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్‌ ‌త్యాగం చేసిన వారికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ హైకమాండ్‌ ‌ప్రియారిటీ ఇచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు అద్దంకి దయాకర్‌ ‌తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ ‌వదులుకోగా.. విజయశాంతి మెదక్‌ ఎం‌పీ టికెట్‌ ‌రేసు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే వీరి త్యాగాలను గుర్తించిన అధిష్టానం.. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది.  సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను ఆ పార్టీ ప్రకటించింది.

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఆయన పేరును రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.ప్రస్తుతం సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. సత్యం పేరును ఆ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. సీనియర్‌నేత చాడ వెంకట్‌రెడ్డి పేరునూ ప్రతిపాదించగా.. తాను పోటీలో ఉండటం లేదని ఆయన ప్రకటించారు. దీంతో సత్యం పేరును సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడు స్థానంలో పోటీ చేయాల్సిందేనని సీపీఐ నల్గొండ జిల్లా నాయకత్వం పట్టుబట్టింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ‌కొత్తగూడెం స్థానాన్ని కేటాయించిందని వివరిస్తూ భవిష్యత్తులో వొచ్చే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని నెల్లికంటి సత్యంకు పార్టీ నాయకులు హా ఇచ్చారు. ఆ మేరకు తాజాగా ఖరారు చేశారు.

1969లో జన్మించిన నెల్లికంటి సత్యం మునుగోడు మండలం ఎల్లలగూడెం గ్రామవాసి. పొలిటికల్‌ ‌సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేశారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు సీపీఐ ఉద్యమ నాయకుడిగా పేరుంది. 1985 నుంచి 2000 వరకు పార్టీ యువజన విభాగం ఏఐవైఎఫ్‌ ‌నల్గొండ జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఉన్నారు. 2010-2016 వరకు మునుగోడు మండల కార్యదర్శిగా, 2016 నుంచి నల్గొండ జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శిగా, 2020 నుంచి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. స్నేహధర్మాన్ని పాటిస్తూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కాంగ్రెస్‌ ‌కేటాయించింది. ఆ పార్టీ అగ్రనేతలు ఖర్గే, సోనియాగాంధీ.., సీఎం రేవంత్‌, ఉపముఖ్యమంత్రి భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు ధన్యవాదాలు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com