మేడ్చల్ వరకు మెట్రో ప్రకటన ఒక్కసారిగా రియల్టర్ల చూపు మార్చేసింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు రియల్ ఎస్టేట్ రంగానికి తిరుగులేని బూస్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మెట్రో విస్తరణలో భాగంగా నార్త్ సిటీ వైపు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్‌తోపాటు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్‌కు మెట్రోను విస్తరించనున్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్నారు.
మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం తరహాలోనే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించనున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. నాగోల్ – ఎయిర్ పోర్ట్ వరకు, రాయదుర్గం -కోకాపేట్ నియోపోలిస్ వరకు, పటాన్ చెరు, హయత్ నగర్, ఫోర్త్ సిటీ కి కలిపేలా ఇప్పటికి డీపీఆర్‌లు రెడీ చేశారు. మేడ్చల్ మెట్రో వాటికి అదనంగా జత చేయనున్నారు.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మేడ్చల్ వైపు శరవేగంగా విస్తరిస్తోంది. రవాణా సదుపాయాలు బాగున్నప్పటికీ.. మెట్రో లేకపోవడం అనేది లోటుగా ఉండేది. ప్రభుత్వ ప్రణాళికల్లోనూ లేకపోవడంతో ఎప్పుడూ చర్చకు రాలేదు. హఠాత్తుగా రేవంత్ రెడ్డి మెట్రో ప్రణాళికలు సిద్ధం చేయడంతో అటు వైపు రియల్ ఎస్టేట్ రంగం మరింత వృద్ధి నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కారిడార్ల నిర్మాణం ఇలా..
రెండో దశలో పార్ట్-బి కింద రెండు కారిడార్లను చేపట్టాలని సడెన్ నిర్ణయం తీసుకున్నారు. ప్యారడైజ్- మేడ్చల్ కారిడార్‌లో భాగంగా ప్యారడైజ్ మెట్రోస్టేషన్, తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు, జేబీఎస్-శామీర్‌పేట్ కారిడార్ కింద జేబీఎస్, విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు కారిడార్ విస్తరించి ఉంటుందని ప్రాథమికంగా వెల్లడించారు. కాగా, గతంలో మల్కాజిగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తనకు నార్త్‌సిటీ ప్రాంత ట్రాఫిక్ సమస్యలపై, ఆయా కారిడార్ల రూట్ మ్యాప్‌లపై అవగాహన ఉందని, అయినప్పటికీ రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. డీపీఆర్ తయారీని మూడు నెలల్లోగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాలతో డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపట్టుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్వరూపం
మొదటి దశ
కారిడార్-1 (ఎల్‌బీనగర్-మియాపూర్) 29
కారిడార్-2 (జేబీఎ్‌స-ఎంజీబీఎస్) 11
కారిడార్-3 (నాగోల్ – రాయదుర్గం) 29
రెండో దశ- పార్ట్-ఎ
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట 7.5
నాగోల్-ఎల్‌బీనగర్-చాంద్రాయణగుట్ట
-ఆరాంఘర్-శంషాబాద్ 36.4
రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్ 11.6
మియాపూర్ – బీహెచ్‌ఈఎల్- పటాన్‌చెరు 13.4
ఎల్‌బీనగర్ – వనస్థలిపురం- హయత్‌నగర్ 7.1
శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఓఆర్‌ఆర్ మీదుగా కొంగరకలాన్- ఫోర్త్ సిటీ 40
రెందో దశ- పార్ట్-బి
ప్యారడైజ్- మేడ్చల్ 23
జేబీఎస్ – శామీర్‌పేట 22