రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1-5 తరగతుల విద్యార్థులకూ ఈసారి నుంచి నోట్ పుస్తకాలు అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇంతవరకు 6-10 తరగతుల విద్యార్థులకే వాటిని ఇస్తుండగా, ఇప్పుడు ప్రాథమిక తరగతుల పిల్లలకూ ఇవ్వనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాద్లో డీఈవోలతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పలు నిర్ణయాలను వెల్లడించారు. 1-2 తరగతుల విద్యార్థులకు మూడు, 3 – 5 తరగతుల వారికి నాలుగు చొప్పున నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. వాటికి వర్క్బుక్లతో పాటు నోట్ పుస్తకాలను కూడా అదనంగా ఇవ్వనున్నారు. ఈ నెల 15 నుంచి వాటిని జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
విద్యా శాఖ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇకపై ప్రతి శుక్రవారం పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 6న బడిబాట మొదలవనుండగా, ఆరోజు మెగా పీటీఎం (తల్లిదండ్రుల సమావేశం) నిర్వహిస్తారు.
ప్రస్తుతానికి ఖాన్ అకాడమీ ద్వారా మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో 6 నుంచి 12వ తరగతి వరకు గణితం, సైన్స్ సబ్జెక్టులను ఆన్లైన్లో నేర్చుకునే సదుపాయం ఉండగా, దాన్ని మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ఈ అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నీట్, జేఈఈ కోచింగ్ కూడా పొందొచ్చు.
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నడుస్తున్న భవిత కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తారు.
కలెక్టర్లను సంప్రదించి ఏఐ ల్యాబ్ల ఏర్పాటుకు అవసరమైన వసతులున్న పాఠశాలలను డీఈవోలు గుర్తించాల్సి ఉంది. యూడైస్ గణాంకాలపై ఇటీవల డైట్ విద్యార్థులు పరిశీలన జరపగా పలు వ్యత్యాసాలు గుర్తించారు. అయితే ప్రధానోపాధ్యాయులు వాటిని వెంటనే సవరించి యూడైస్ పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంది.