Friday, May 23, 2025

షర్మిల కాదు.. మన కవితే అసలు లేఖ లీక్‌ చేసిందెవరు..?

ఏదో నాలుగు రకాల రాజకీయ ప్రసంగాలు.. అప్పుడో ఇప్పుడో ఏదో ఒక ధర్నా.. ఎక్కడైనా.. అమాసకో.. పున్నానికో ఎవరైనా.. ఏదైనా జిల్లాలో మీటింగ్‌ పెడితే పోయి రావడం.. లేదంటే ట్విట్టర్‌ ద్వారా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. బీఆర్‌ఎస్‌లో కీలక నేతలు ఇదే ఫార్ములాతో రాజకీయ బండిని లాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో కవిత లేఖ కారు పార్టీలో కలకలం రేపుతోంది. కవిత స్థాయి నేత.. తండ్రికి లేఖ రాస్తే.. అది ఎలా బయటకు వచ్చింది? లెటర్ ఎలా లీక్ అయింది? ఎవరు లీక్ చేశారు? సరిగ్గా కవిత విదేశాల్లో ఉన్న సమయంలోనే లేఖ వైరల్ కావడం వెనుక వ్యూహం ఉందా? కవిత వేరు కుంపటి కన్ఫామా? బీఆర్ఎస్, బీజేపీల పొత్తు ఉంటుందా? ఇలా తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేలా ఉంది కవిత గొడవ. ఇప్పుడు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ చరిత్ర గతంలోనూ కొనసాగింది. తండ్రికీ.. అన్నకు కుడి భుజంగా.. అన్న విడిచిన బాణంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిల ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది. బాణం బాణం అంటూనే జగన్‌ కొంప ముంచింది. ఇప్పుడు అదే పని కవిత చేస్తుందా.. అనేది రాజకీయ వర్గాల్లో టాక్‌.

అసలు పంచాయితీ ఏంది..?
ఇప్పుడు కవితది రాజకీయ పంచాయితీనా? ఆస్తుల పంచాయితీనా? అనే ప్రశ్నలు వస్తుననాయి. అంతేకాదు.. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారంటూ కొత్త విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తున్నదని అన్నారు. మొత్తంగా జగనన్నతో షర్మిలకు విభేదాలు వచ్చాయి. పార్టీ కోసం వాడేసుకుని.. గెలిచాక పక్కనపెట్టేశారంటూ చెల్లి మండిపడింది. ఆస్తులు సరిగ్గా పంచకుండా తనకు అన్యాయం చేశారంటూ అన్నతో గొడవ పెట్టుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టుకుంది. కొంతకాలం బాగానే ట్రై చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కలిపేశారు. ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. కవిత ఎపిసోడ్ సైతం షర్మిల స్టోరీతో సరిపోలుతోందని విశ్లేషిస్తున్నారు.

కవితకు పొగ పెట్టేశారా?
కల్వకుంట్ల కుటుంబంలో సైతం కుంపటి రాజుకుందని అంటున్నారు. జైలు నుంచి వచ్చాక కవిత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీయే ఆమెను దూరం పెట్టిందనే టాక్ కూడా ఉంది. జాగృతి జెండా కిందనే యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు కవిత. బీసీ నినాదం ఎత్తుకున్నారు. ఫూలే విగ్రహం కోసం పట్టుబడుతున్నారు. సామాజిక తెలంగాణ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ బీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగించే స్ట్రాటజీలే అంటున్నారు. చెల్లి ఎత్తుగడలు పసిగట్టిన కేటీఆర్.. ఇటీవల బావ హరీశ్‌రావుతో వరుస మీటింగ్‌లు జరిపారని అంటున్నారు. కవిత పార్టీని వీడితే సరే.. లేదంటే వాళ్లే వెళ్లగొట్టేలా ఉన్నారని తెలుస్తోంది. అందుకే, ఇటీవల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు జైల్లో ఉండొచ్చా.. ఇంకా తనను కష్టపెడతారా? తనపై కుట్ర చేస్తుంది ఎవరో తెలుసు.. రెచ్చగొడితే మరింత రెచ్చిపోతా.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా కేటీఆర్ టార్గెట్‌గా హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు.

లేఖ లీక్ చేసింది ఎవరు?
కేటీఆర్‌, కవిత మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆస్తుల నుంచి రాజకీయ వారసత్వం వరకూ.. సేమ్ టు సేమ్ జగన్ వర్సెస్ షర్మిల వివాదం మాదిరే.. కేటీఆర్ vs కవిత ఎపిసోడ్ కాక మీదుందని బీఆర్ఎస్ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్నను దెబ్బకొట్టేందుకే.. చెల్లి సొంత ఎజెండాతో కలకలం రేపుతున్నారని చెబుతున్నారు. మై డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్‌ను కార్నర్ చేసేలా ఉన్న కవిత రాసిన లేఖ సైతం అందులో భాగమేనని అంటున్నారు. లేఖ రాసింది.. లీక్ చేసిందీ కవితనే అనే అనుమానాలు లేకపోలేదు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టడం కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి, కవిత వేరు కుంపటి ఎవరికి కలిసొస్తుంది? బీజేపీకా? కాంగ్రెస్‌కా? కూతురు గొడవను గులాబీ బాస్ హ్యాండిల్ చేయగలరా?

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com