గతంలో సినిమా బడ్జెట్ ఎంతైనా కావచ్చు. టికెట్ రేటు మాత్రం డిసైడ్ చేసేది ఏపీలో జగన్ ప్రభుత్వమే. ఆ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు పడిగాపులు కాశారు స్టార్ హీరోలు, నిర్మాతలు. ఆ విజువల్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ చూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల్లో కొందరు ముందు నుంచి తెలుగు దేశం పార్టీకి వీర విధేయులు. వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. అటువంటి నిర్మాతల్లో వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుమారు ఐదు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదల ముందు మరో ఆలోచన లేకుండా నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగు దేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు.
ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే? ఆ ఆలోచన ‘కల్కి’ మూవీ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ హక్కులు కొన్న, కొనుగోలు చేయాలని అనుకుంటున్న కొంత మందిలో భయాన్ని కలిగించింది. వైసీపీ అధికారంలోకి వస్తే? భారీ రేట్లకు సినిమాను కొంటే? లాభాల మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి రాదని భయపడ్డారు. ఇప్పుడు ఆ భయాలు అవసరం లేదు. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో తెలుగు సినిమాకు పూర్వ వైభవం వస్తుందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ‘కల్కి 2898 ఏడీ’ బెనిఫిట్ షోలు పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అంతే కాదు… టికెట్ రేట్లు సైతం పెంచుకోవడానికి అనుమతులు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు.
ఒక్క ‘కల్కి’ సినిమాకు మాత్రమే కాదు… ఏపీలో ఇతరత్రా సినిమాలకు సైతం కొత్త ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ముందు నుంచి సినిమా ఇండస్ట్రీకి తెలుగు దేశం పార్టీ సన్నిహితంగా మెలిగింది. ఆ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు హీరో కావడం, ఆయన వారసులు అటు పార్టీలో ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మాత్రమే కాదు… చిత్రసీమ కష్టసుఖాలు తెలిసిన కొందరు తెలుగు దేశంలో ఉండటం కూడా ఆది నుంచి సత్సంబంధాలు కొనసాగేలా ఉండటానికి కారణం అయ్యింది.