- బిజెపి ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా కాల రాసింది
- పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పని చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. 8వ తరగతి నుంచి విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ప్రియంబుల్ ఉండే విదంగా చూడాలని సిఎంని కోరనున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా కాల రాసిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో టిపిసిసి ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బిజెపి మార్చాలని ప్రయత్నాలు చేసిందన్నారు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు వారికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాడానికి ముందుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలోనే కులగణన చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మేధావుల సూచనలు, సలహాల ద్వారా కులగణన చేస్తున్నామని, బిజెపి తిరోగమనం చేపట్టక తప్పదన్నారు. కులగణనలో రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు. ప్రతి తరగతిలో భారత రాజ్యాంగం పీఠిక ఉండేలా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.