మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి పుష్పాంజలి ఘటించారు. నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, సహా ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నమస్సులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఘనకీర్తి.. తెలుగువారికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలుగు వారి గుండె చప్పుడు : వెంకయ్య నాయుడు
దివంగత ఎన్టీఆర్‌కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి గుండె చప్పుడు, ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని చెప్పారు. చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించి, ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ నవ శకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని తెలిపారు.