జాబిల్లిపై రష్యా చేపట్టిన అణు విద్యుత్ నిర్మాణ ప్రాజెక్టుకు సంబందించిన మిషన్ లో చైనా, భారత్ లు భాగస్వాములు కానున్నట్టు యూరేషియన్ టైమ్స్ నివేదిక తెలిపింది. రష్యా న్యూక్లియర్ ఎనర్జీ కో-ఆపరేషన్ రోస్తోమ్ చీఫ్ అలెక్సీ లిఖాచెవ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆ దేశ అధికారిక మీడియా టాస్ ప్రచురించిన కథనాన్ని ఈ సందర్బంగా యూరేషియన్ టైమ్స్ నివేదిక ప్రస్తావించింది. చంద్రుడిపై అణు విద్యుత్తు ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు కొన్ని నెలల క్రితం రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
చందమామపై అము విద్యుత్ మిషన్‌లో అంతర్జాతీయ సమాజం భాగస్వామ్యం ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయడానికి భారత్, చైనాల చాలా ఆసక్తిగా ఉన్నాయని వ్లోడ్ వోస్టోక్ లోని ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్‌లో లిఖాచెవ్ చెప్పారు. 2040 నాటికి జాబిల్లి పైకి మానవ సహిత యాత్రను చేపట్టి, అణు విద్యుత్ ప్లాంట్ కు సంబందించిన స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్న భారత్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపడం ప్రధాన్యం సంతరించుకుంది.
ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై 0.5 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించనున్నారు. రష్యా, చైనా సంయుక్తంగా పని చేస్తున్న ప్రతిపాదిత ప్లాంట్‌కు రియాక్టర్ శక్తిని అందిస్తుంది. చంద్రుడిపై స్థావరం కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు ఈ మిషన్ సహకరిస్తుందని భావిస్తున్నారు. మానవుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని రష్యా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.