పుప్పాలగూడ జంట హత్యల కేసు – నిందితుల్ని పట్టించిన సెల్ ఫోన్ సిగ్నల్స్
తెలంగాణలోని పుప్పాలగూడ గుట్టల వద్ద ఇటీవల జరిగిన జంట హత్యల కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరణకు అభ్యంతరం తెలిపినందుకు బిందు అనే మహిళను, ఇదే విషయంలో హెచ్చరించినందుకు ఆమె ప్రియుడు అంకిత్ సాకేత్ ను అతని స్నేహితులు పక్కా ప్లాన్ ప్రకారం చంపేసినట్టు పోలీసులు హత్యకు గల కారణాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వనస్థలిపురం నివాసి దివ్య బిందు (30), మధ్యప్రదేశ్‌కు చెందిన నానక్‌రామ్‌గూడా నివాసి అంకిత్ పుప్పాలగూడ కొండలపై హత్యకు గురయ్యారు. వారిద్దరూ నానక్ రామ్ గూడలో పనిచేస్తున్నారు. దివ్యకు వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంకిత్ తో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న బిందు భర్త… వనస్థలిపురం సమీపంలోని చింతల్ కుంటకు మకాం మార్చాడు. అయినప్పటికీ బిందు ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా.. అంకిత్ సాయంతో అక్కడే వ్యభిచారం మొదలుపెట్టడం మరిన్ని వివాదాలకు దారి తీసింది. ఇదే అదనుగా భావించిన అంకిత్ ఫ్రెండ్స్ రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్ర కుమార్ లు బిందును తమ వద్దకు తీసుకురావాలని కోరారు. దీంతో బిందు జనవరి 8న భర్తకు తెలియకుండా అంకిత్ తో కలిసి గచ్చిబౌలిలోని అతని రూమ్ లో గడిపింది. ఇక అలా రెండు సార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. ఆమెతో కలిసి ఉన్న సన్నివేశాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె అడ్డు చెప్పింది. వెంటనే విషయాన్ని అంకిత్ దృష్టికి తీసుకెళ్లగా.. తన ఫ్రెండ్ ను గట్టిగా మందలించాడు. దీంతో గొడవ మరింత పెద్దదైంది.
పక్కా ప్లాన్ ప్రకారమే హత్య
తన స్నేహితుడు అలా బెదిరించడంతో కక్ష గట్టిన రాహుల్.. అంకిత్, బిందులపై కక్ష గట్టాడు. తన మరో ఫ్రెండ్స్ రాజ్, సుఖేంద్రల సాయంతో వారిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే జనవరి 11న అంకిత్ ద్వారా బిందును పిలిపించి.. అదే రోజు బిందు, అంకిత్ తో పాటు రాజ్, సుఖేంద్రలను పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి ఆటోలో తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు అందరూ మద్యం తాగారు. ఈ సమయంలోనే సుఖేంద్ర, బిందును పక్కకు తీసుకెళ్లాడు. అప్పుడే ఒంటరిగా ఉన్న అంకిత్ ను రాహుల్, రాజ్ లు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత పథకం ప్రకారం బిందును కూడా చంపేశారు. ఆ తర్వాత జనవరి 12న ఏమీ తెలియనట్టు నిందితులు తమ సొంత రాష్ట్రమై మధ్యప్రదేశ్ కు పారిపోయారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా పట్టుబడ్డ నిందితులు
పుప్పాలగూడలో బహిర్భూమికి, గాలిపటాలు ఎగురవేసేందుకు వెళ్లిన కొందరు యువకులు వెళ్లగా.. అక్కడ మృతదేహాలు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమందించగా.. వారు మృతదేహాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందుతుల కోసం గాలింపు చేపట్టారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇతర ఆధారాలతో వారి ఆచూకీ గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక బృందం వెంటనే మధ్యప్రదేశ్ కు చేరుకుని ముగ్గురినీ అరెస్ట్ చేశారు.