బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని, వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్సేనంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. “ కేటీఆర్ కు పనీపాట లేదు. ప్రజలెవరూ దేఖడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి పారిపోయినోడు. కాంగ్రెస్ కు లోపాయికారీ సపోర్ట్ చేస్తున్నది మీరే. అందుకే కాళేశ్వరంలో, ఫోన్ ట్యాపింగ్, బామ్మర్థి ఫాంహౌజ్ లో డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేసు స్కాంలో కచ్చితమైన ఆధారాలున్నా మిమ్ముల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. అంటే నిజమైన కేఆర్ బ్రదర్స్ (కేటీఆర్, రేవంత్ రెడ్డి) మీరే. నీ దొంగ నాటకాలు బంద్ చేయ్. నీది బిచ్చపు బతుకు. ఇంకా నీ అహంకారం పోలే. నీ బతుకంతా నా దగ్గర ఉంది. పర్సనల్ గా పోవద్దని నేను ఆగుతున్నా. సవాల్ చేస్తే అవన్నీ బయటపెడతా.“ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై లీగల్ నోటీసు ఇచ్చి పారిపోయిన పరికిపంద కేటీఆర్ అని, కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను కుక్కులు కూడా దేకవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ అనేటోడు లేకపోతే కేటీఆర్‌ను రాళ్లతో కొడతారని, అమెరికాలో చిప్పలు కడిగినోడివి.. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఉద్యమం పేరు చెప్పి టిక్కెట్లు దండుకున్నావని, అయ్యపేరు చెప్పి బతుకుతున్నావంటూ ఫైర్ అయ్యారు.
తాను సామాన్య కార్యకర్తను అని, కింది స్థాయి నుండి ఉద్యమాలు చేసి లాఠీదెబ్బలు తిని జైళ్లకు పోయి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడిగా చలామణి అవుతుంటే ఇక్కడ దోశలేసినట్లు ఫోజులిచ్చి సిరిసిల్లలో మహేందర్ రెడ్డికి దక్కాల్సిన టిక్కెట్ ను గుంజుకుని పోటీ చేసి సొంత పార్టీ నాయకులనే మోసం చేసిన చరిత్ర కేటీఆర్ ది అని, ఆయన, రేవంత్‌రెడ్డి ఇద్దరూ అవినీతి పరులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై కొట్లాడేది బీజేపీయేనని, అందుకే బీఆర్‌ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారన్నారు. “ యూజ్ లెస్ ఫెలో… నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే రాళ్లతో కొడతరు. నీలెక్క పైసలిచ్చి బీరు, బిర్యానీలతో సభలు పెట్టి పార్టీ నడిపే చరిత్ర బీజేపీది కాదు..“ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.