ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఒ.పి. చౌధరి వార్తల్లో నిలిచారు. చాట్ జీపీటీ యుగంలోనూ ఇంత టెక్నాలజీ కమ్యూనికేషన్ యుగంలో కూడా ఆయన చేతిరాతతోనే పూర్తి బడ్జెట్‌ను రూపొందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సుమారు రూ.1.65 లక్షల కోట్లతో ఆయన శాసనసభకు సమర్పించారు.
సాధారణంగా బడ్జెట్ పత్రాలను అధికారులు కంప్యూటర్ల ద్వారా రూపొందిస్తుంటారు. అయితే, చౌధరి మాత్రం తన భావాలు, దార్శనికత, రాష్ట్రం పట్ల తన నిబద్ధతను చేతిరాత ద్వారానే మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలనని భావించారు. అందుకే వంద పేజీల బడ్జెట్‌ను స్వయంగా హిందీలో రాశారు.
ఈ బడ్జెట్ రూపకల్పన కోసం ఆయన దాదాపు నాలుగు రోజులపాటు రోజుకు గంట లేదా గంటన్నర మాత్రమే నిద్రపోయారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తాను ఐఏఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చౌధరి పేర్కొన్నారు. చేతితో రాసిన బడ్జెట్ పత్రం పారదర్శకతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ తయారీకి దాదాపు 5-6 నెలల సమయం పట్టిందని, అయితే బడ్జెట్‌లోని అంశాలను మాత్రం చివరి 10 రోజుల్లో రాశానని ఆయన తెలిపారు.