దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. అందులోను మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఆడవాళ్లపై అత్యాచార ఘటనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకవైపు కోల్కతాలో వైద్య విధ్యార్ధినిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుండగా.. ఈ ఘటన మరువక ముందే.. దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ నగర శివారు ప్రాంతం నోయిడా సెక్టార్ 94లో ఉన్న ఓ పోస్టుమార్టం హౌస్లో మహిళపై లైంగిక దాడి జరిగింది. పోస్ట్ మార్టమ్ రూమ్ లో పనిచేసే ఉద్యోగి ఒకరు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతే కాదు ఈ దుర్మార్గమైన ఘటనను మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు.
పోస్ట్ మార్టమ్ గదిలోని డీప్ ఫ్రీజర్ రూమ్లో ఓ వ్యక్తి మహిళను లోబర్చుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్ధమవుతోంది. ఆమెతో అతడు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించగా, ఈ వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి తరువాత తన వంతు అని చెబుతున్నాడు. ఈ ఇద్దరు నిందితులు మృత దేహాలను డీప్ ఫ్రీజర్లో భద్రపరిచే గదిలో ఈ అమానుష పనికి పాల్పడ్డారు. ఐతే ఆ మహిళ పోస్ట్ మార్టమ్ రూంకు ఎలా వచ్చిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మహిళ అరుపులు విని పోస్ట్ మార్టమ్ గదికి వెళ్లి చూడగా ఆమెపై అత్యారం చేస్తున్నాడో దుర్మార్గుడు. ఐతే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.